Balagam Actor:జబర్దస్త్ (Jabardast) కమెడియన్ వేణు యెల్దండి (Venu Yeldandi) దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. ఇందులో సినీ తారలతో పాటు ఎంతోమంది జానపద, రంగస్థలం కళాకారులు కూడా నటించారు. అలాంటి వారిలో బాబు అలియాస్ జీవి బాబు (GV Babu) కూడా ఒకరు. ఇదే సినిమాలో కొమరయ్య తమ్ముడు అంజన్న పాత్రలో నటించిన జీవి బాబు అనారోగ్యంతో మంచాన పడ్డాడు. దీనికి తోడు అవకాశాలు కూడా లేవనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. వరంగల్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న ఈయనకు తరచూ డయాలసిస్ చేయిస్తున్నట్లు సమాచారం.
ఆర్థిక ఇబ్బందుల్లో.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బలగం నటుడు..
ముఖ్యంగా వైద్యానికి, మందులు కొనుగోలు చేయడానికి కూడా డబ్బులు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆయన కుటుంబ సభ్యులు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, జీవి బాబుకి మెరుగైన వైద్యం అందించాలని, దాతలు, కళాకారులు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయాలి అని తెలంగాణ నాటక సమాజ సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం కోరారు. ఇక ప్రస్తుతం ఈయన పరిస్థితి చూసి అభిమానులు సైతం చలించిపోతున్నారు. గొప్ప నటులకు ఇలాంటి అనారోగ్య సమస్యలు రావడం.. పైగా ఆర్థిక సమస్యలు తలెత్తడం నిజంగా బాధాకరమని కామెంట్లు చేస్తున్నారు.
దాతల కోసం ఎదురుచూపు..
ఇకపోతే బలగం సినిమాతో పేరు వచ్చినా కూడా.. డబ్బు మాత్రం రాలేదు. అలాగే అవకాశాలు కూడా రాలేదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జీవీ బాబు వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన రంగస్థలం కళాకారుడు. బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో కొమరయ్య తమ్ముడిగా అంజన్న పాత్రలో అద్భుతంగా నటించి ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టించాడు. ఇకపోతే బలగం సినిమా తర్వాత ఈయనకు అవకాశాలు రాలేదు. దీంతో కుటుంబం ఆర్థిక సమస్యల బారిన పడింది. దీనికి తోడు బాబుకి అనారోగ్య సమస్యలు. అందుకే ఎవరైనా దాతలు స్పందించాలని, ఆర్థిక సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
మొగిలయ్యకు లాగానే అంజన్నకు సహాయం చేస్తారా?
ఇదిలా ఉండగా గతంలో బలగం సినిమా నటుడు మొగిలయ్యకు కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వంతో పాటు కేటీఆర్ (KTR ), మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తో పాటు పలువురు బడా రాజకీయ, సినీ ప్రముఖులు స్పందించి, వైద్య ఖర్చులకు తమకు తోచిన సహాయం అందించి, ఆయనను ఆదుకున్నారు. ఇప్పుడు బాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి దాతలు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేయకపోరా అని బాబు దీనస్థితిలో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ కూడా దాదాపుగా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన విషయం తెలిసిందే. మరొకవైపు ఈ సినిమా దర్శకుడు వేణు ఈ సినిమా అందించిన సక్సెస్ తో.. నితిన్ (Nithin ) హీరోగా ‘ఎల్లమ్మ’ సినిమా కూడా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్ పైకి వెళ్లనుంది. బలగం సినిమాతో రికార్డులతో పాటు అవార్డులు కూడా అందుకున్న వేణు.. ఈ ఎల్లమ్మ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
AALSO READ:Kiara advani: బేబీ బంప్ తో దర్శనమిచ్చిన కియారా.. ఎంత క్యూట్ కదా..!