Balagam Mogilaiah: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ‘బలగం’ సినిమాలో తనదైన నటన కనబరిచి అందరికీ ఆకట్టుకున్నారు మొగిలయ్య. గత కొన్నిరోజులుగా కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు మొగిలయ్య. ఈ విషయంపై ఎన్నోసార్లు చికిత్స కూడా జరిగింది. ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ఆయన చికిత్సకు ఎన్నోసార్లు ఆర్థిక సాయం అందించారు. తాజాగా ఆయనకు మరోసారి కిడ్నీ సమస్య రావడంతో వరంగల్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయన కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున మొగిలయ్య మరణించారు. ఈ మరణవార్త తెలిసిన ఎంతోమంది సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
జానవద కళాకారుడు
జానపద కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న మొగిలయ్య.. ‘బలగం’ సినిమాతో వెండితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో నటించినందుకు ఆయన అనారోగ్య సమస్యల గురించి తెలుసుకున్న ‘బలగం’ డైరెక్టర్ వేణు సైతం ఎన్నోసార్లు మొగిలయ్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందించారు. ‘బలగం’ మాత్రమే కాదు ‘భీమ్లా నాయక్’లో కూడా ఒక జానపదం గీతం పాడి అందరినీ అలరించారు మొగిలయ్య. జానవద గాయకుడిగా బయట ప్రేక్షకులను మాత్రమే కాదు.. మూవీ లవర్స్‌ను కూడా ఆకట్టుకున్న మొగిలయ్యకు ఇండస్ట్రీ అశ్రునివాళి ప్రకటించింది. ముఖ్యంగా ‘బలగం’ అనే ఒక్క సినిమా.. ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈరోజుల్లో సినిమాల్లో జానపద గేయాలు ఉండడం అనేది చాలా అరుదుగా మారిపోయింది. అలాంటి ‘బలగం’లో దాదాపు పావుగంట క్లైమాక్స్‌ను జానవద గీతంతోనే నడిపించాడు దర్శకుడు వేణు.
క్లైమాక్స్ కీలకం
‘బలగం’ క్లైమాక్స్ అంత చక్కగా అందరికీ గుర్తుండిపోడానికి ముఖ్య కారణం మొగిలయ్య. చాలామంది ప్రేక్షకులు ఈ క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిపోయారు కూడా. అంతలా మొగిలయ్య గానం ప్రేక్షకులను ఇంపాక్ట్ చేసింది. మొగిలయ్యకు చాలాకాలం నుండే కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధి ఉంది. అదే వ్యాధితో తీవ్ర ఆనారోగ్యంతో తాజాగా దుగ్గొండిలో మరణించారు. అప్పటివరకు కామెడియన్‌గా పలు షోస్‌లో, సినిమాలతో ఆకట్టుకున్న వేణు యెల్ధండి.. ‘బలగం’తో దర్శకుడిగా మారాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాతో తెలంగాణ కల్చర్‌ను మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేయాలని అనుకున్నాడు. అందుకే ఈ సినిమా కోసం ఎంతోమంది నేటివ్ ఆర్టిస్టులను తీసుకున్నారు. అలాగే క్లైమాక్స్‌లో మొగిలయ్యను కూడా రంగంలోకి దించారు. అలా మొగిలయ్య ఈ సినిమాలో భాగమయ్యారు. తనతో పాటు తన భార్య కొమురమ్మ కూడా ఈ సినిమాలో పాట పాడారు. అలా ఈ జంటలో తెలుగు ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు.
అందరి సాయం
‘బలగం’ సినిమా సమయంలోనే తనకు కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధి వచ్చింది. అందుకే మూవీ క్లైమాక్స్‌కు ప్రాణం పోసిన మొగిలయ్య చికిత్స కోసం కావాల్సిన ఖర్చులను తానే పెట్టుకుంటానని వేణు మాటిచ్చాడు. కొన్నాళ్ల క్రితం పొన్నం సత్తయ్య అవార్డు ఫంక్షన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మొగిలయ్య దంపతులకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని, వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ మధ్యే రూ.లక్షా ఆర్థిక సాయం అందించారు.