Daaku Maharaj Success Meet:నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna)హీరోగా, ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby kolli) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘డాకు మహారాజ్ ‘. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు విచ్చేసింది. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో .. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మొదట్లో పర్వాలేదు అనిపించుకుంది. కానీ అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించడానికి సిద్ధం అయిపోయారు చిత్ర బృందం.
ఆగిన చోటే సక్సెస్ మీట్..
ఇదిలా ఉండగా జనవరి 9వ తేదీన అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక తొమ్మిదవ తేదీన ఈవెంట్ నిర్వహించాల్సి ఉండగా.. జనవరి 8వ తేదీన తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో భాగంగా కొంతమంది భక్తులు మరణించారు. ఇక వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే. దాంతో అభిమానులు పెద్ద ఎత్తున నిరాశలు మునిగిపోయారు. ఇక ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా సక్సెస్ కావడంతో.. ప్రీ రిలీజ్ ఆపి అభిమానులను నిరాశపరిచిన బాలయ్య, ఇప్పుడు అక్కడ సక్సెస్ మీట్ నిర్వహించబోతున్నారు. జనవరి 22 అనగా ఈరోజు సాయంత్రం అదే ప్రాంగణంలో బాలయ్య డాకుమహారాజ్ సక్సెస్ ఈవెంట్ జరగబోతోంది.
అనంతపురంకు తరలివస్తున్న తారలు..
సాయంత్రం సక్సెస్ మీట్ నిర్వహించబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ తారలు అనంతపురానికి చేరుకుంటున్నారు. అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీ సమీపంలో ఈరోజు సాయంత్రం జరగనున్న విజయోత్సవ వేడుకకు సినీ తారలు ఒక్కొక్కరిగా చేరుకుంటూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా హీరో బాలకృష్ణతోపాటు హీరోయిన్స్ ప్రగ్యా జైస్వాల్(Pragya jaiswal, శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath), ఊర్వశీ రౌతేలా (Urvashi rautela) మరొకసారి తమ అందాలతో ప్రజలను నేరుగా ఆకట్టుకోవడానికి విచ్చేస్తున్నారు. వీరితోపాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, చిత్ర దర్శకుడు బాబి, నిర్మాత నాగ వంశీ తదితరులు రాబోతున్నారు. అలాగే ఈ ఈవెంట్ కి పాస్ ఉన్న వారిని మాత్రమే అనుమతించబోతున్నట్లు సమాచారం.
బాలకృష్ణ తదుపరి చిత్రాలు..
అఖండ సినిమా మొదలుకొని ఇటీవల విడుదలైన డాకు మహారాజ్ చిత్రాల వరకు వరుస సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంటున్న బాలయ్య.. ఇప్పుడు అఖండ 2 సినిమా షూటింగ్ మొదలు పెట్టేశారు. మహా కుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ అఘోరాల మధ్య సినిమా ప్రారంభించడం జరిగింది. బోయపాటి శ్రీను ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. ఎప్పటిలాగే ఈ చిత్రానికి కూడా ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.