Balakrishna:76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచి, వినూత్న సేవలందించిన వారిని గుర్తించి , పద్మ అవార్డులతో గౌరవంగా సత్కరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినీ పరిశ్రమ నుండి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), హీరో అజిత్ (Ajith) , సీనియర్ హీరోయిన్ శోభన (Shobhana) లకు పద్మభూషణ్ అవార్డు వరించింది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణకు తెలుగు సినీ పరిశ్రమ నుండి పలువురు సెలబ్రిటీలు , బడా వ్యాపారవేత్తలు, నిర్మాతలు, దర్శకులు, యంగ్ హీరోలు అందరూ కూడా ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు పద్మభూషణ్ అవార్డు రావడం పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు బాలయ్య.
పద్మభూషణ్ రావడం పై స్పందించిన బాలకృష్ణ..
ఈ మేరకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక సుదీర్ఘ నోటు వదిలారు. ఇక అందులో ఏముందనే విషయానికి వస్తే..
“పద్మభూషణ్ అవార్డుతో నన్ను సత్కరించినందుకు భారత ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రతిష్టాత్మకమైన గుర్తింపును నాకు అందించినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సందర్భంగా నాకు శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో భాగమైన నా తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, కుటుంబ సభ్యులు, మొత్తం సినీ వర్గానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.మా నాన్నగారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి గర్వకారణమైన వారసుడిగా.. నాకు అండగా నిలిచిన నా అభిమానులకు, నాపై అచంచలమైన ప్రేమను, ఆదరణను కొనసాగిస్తున్న అసంఖ్యాక ప్రేక్షకులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.ఈ సంతోషకరమైన సందర్భంగా నా తోటి పద్మ అవార్డు గ్రహీతలకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అప్పుడు.. ఇప్పుడు..ఎప్పటికీ. ఎల్లప్పుడూ మీ వాడినే.. నందమూరి బాలకృష్ణ” అంటూ నందమూరి బాలకృష్ణ పోస్ట్ షేర్ చేశారు.
ఈ ఏడాది పద్మ పురస్కారాలు అందుకున్న సెలబ్రిటీస్..
ఇకపోతే నందమూరి బాలకృష్ణ తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఏడుగురు పద్మ అవార్డులకు ఎంపిక అయ్యారు. వైద్య రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ లభించగా.. సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు లభించింది. ఇక ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణ మాదిగకు, కళలు, సాహిత్యం, విద్యా విభాగాలలో కేఎల్ కృష్ణ, మాడుగుల నాగ ఫణిశర్మ, దివంగత మిరియాల అప్పారావు, రాఘవేంద్రాచార్య పంచముఖి లకు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. ముఖ్యంగా బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు రావడంతో అటు నందమూరి కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. దీనికి తోడు బాలకృష్ణకు అవార్డు వచ్చిందని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా స్పందించడంతో అభిమానుల ఆనందం రెట్టింపు అయిందని చెప్పవచ్చు. ఇటీవలే ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బాలయ్య, ఇప్పుడు వరుస సినిమాలతో భారీ సక్సెస్ అందుకుంటున్నారు.