US Aid Ukraine Zelenskyy| అగ్రరాజ్యం అమెరికా ప్రపంచ దేశాలకు అందిస్తున్న అన్ని రకాల ఆర్థిక సహాయాలను 90 రోజులపాటు నిలిపివేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేసిన విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్‌కు అందించే సైనిక సహాయం కొనసాగుతున్నదని ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. కష్టసమయంలో అమెరికా తీసుకున్న సానుకూల నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ప్రపంచ దేశాలకు ఆర్థిక, మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించినప్పుడు ఆందోళన చెందాను. కానీ మాకు అవసరమైన ఆయుధ సహాయం ఆగకపోవడం భగవంతుడి దయ’’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ తన సైనిక అవసరాల్లో 40 శాతం అమెరికాపైనే ఆధారపడుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ గతంలో 725 మిలియన్ డాలర్ల ప్యాకేజీతో పాటు 988 మిలియన్ డాలర్ల మిలిటరీ సామగ్రి అందిస్తామని హామీ ఇచ్చారు. 2022 నుంచి ఇప్పటివరకు వాషింగ్టన్ నుంచి కీవ్ (ఉక్రెయిన్ రాజధాని) కు 62 బిలియన్ డాలర్ల సహాయం అందింది. కొద్ది రోజుల క్రితం రక్షణ మంత్రి ఆస్టిన్ కూడా ఉక్రెయిన్‌కు 500 మిలియన్ డాలర్ల ఆయుధసాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు మార్లు ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని చెప్పారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ యుద్ధం అసలు మొదలయ్యే పరిస్థితి తాను అధ్యక్షుడిగా ఉంటే వచ్చేదికాదని తెలిపారు. త్వరలోనే యుద్ధానికి ముగింపు పలుకుతానని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ శాంతి చర్చలకు పుతిన్ రాకపోతే రష్యాపై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు.
Also Read: గల్ఫ్ ఆఫ్ అమెరికా పేరు అఫీషియల్.. గ్రీన్‌లాండ్ కోసం డెన్మార్క్ ప్రధానికి ట్రంప్ బెదిరింపులు
అయితే శుక్రవారం జనవరి 24, 2025న అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో చేసిన ప్రకటన ప్రకారం, ప్రపంచ దేశాలకు అన్ని రకాల ఆర్థిక సాయం తక్షణమే నిలిపివేయబడింది. కానీ ఈ జాబితాలో ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలను మినహాయించారు. ఈ రెండు దేశాలకు మాత్రం మిలిటరీ, ఆర్థిక సాయాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ నిర్ణయం అమెరికాను ఆర్థికంగా బలపరిచేందుకు తీసుకున్నదని “ది న్యూ యార్క్ టైమ్స్” రిపోర్ట్ చేసింది.
ఈ ఆదేశాల ప్రకారం ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం ఆపివేయబడింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సాయాన్ని పునరుద్ధరించేందుకు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆమోదం అవసరమని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ప్రపంచంలో తయారీ రంగం, విద్య, వైద్య, మానవతా సేవల కార్యక్రమాలు సంక్షోభానికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇజ్రాయెల్‌కు బాంబుల సరఫరా పునరుద్ధరణ
గాజాలో విధ్వంస తీవ్రతను తగ్గించేందుకు బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ పక్కనపెట్టారు. ఇజ్రాయెల్‌కు బంకర్ బస్టర్ బాంబుల సరఫరాకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్వేతసౌధం ప్రకారం, 1,800 ఎంకే-84 బాంబులను ఇజ్రాయెల్‌కు సరఫరా చేయనున్నారు. జనావాసాలపై ఈ బాంబుల వాడకంపై గతంలో అభ్యంతరాలు రావడంతో బైడెన్ వీటిని నిలిపివేశారు. ఇప్పుడు ఈ సరఫరా పునరుద్ధరించడం ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అంచనా.