Balakrishna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలలో నందమూరి (Nandamuri ) కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ కుటుంబం అంటే ఎనలేని గౌరవం కూడా.. ఆంధ్రులు “అన్నగారు” అని ముద్దుగా పిలుచుకునే స్వర్గీయ నందమూరి తారక రామారావు (Sr.NTR) నేడు మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలను, ఆశయాలను ముందుకు నడిపిస్తూ.. ఆయన వారసులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. అయితే ఇలాంటి సమయంలో ఆయన వారసులలో ఒకరైన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చేసిన ఒక పని ఇప్పుడు సర్వత్రా విమర్శలకి తావు ఇస్తోంది.
బ్రాందీ బ్రాండ్ ప్రమోటర్గా మారిన బాలయ్య..
అసలు విషయంలోకి వెళ్తే.. ఒకవైపు సినీ నటుడిగా మరొకవైపు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టి ఇటు అభిమానుల మనసును, అటు ప్రజల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నారు బాలయ్య. ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన.. అటు హిందూపురం నియోజకవర్గాన్ని పూర్తిగా డెవలప్మెంట్ చేసి, ఆ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. ఇక ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారిన బాలయ్య.. ఇటీవలే ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సినీ ఇండస్ట్రీకి చేసిన విశేష సేవను గుర్తించిన భారత ప్రభుత్వం.. భారతదేశ అత్యంత మూడవ పౌర పురస్కారమైన ‘పద్మభూషణ్ ‘ తో సత్కరించింది. అయితే ఇంత గొప్ప పురస్కారాన్ని అందుకున్న తర్వాత ఆ పురస్కారానికి తగ్గట్టుగా బాలయ్య వ్యవహరించాలి కదా.. కానీ ఆయన ఒక బ్రాందీ కి బ్రాండ్ ప్రమోటర్ గా మారి బ్రాందీ తాగండి అంటూ యువతను ప్రోత్సహిస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. దీంతో బాలయ్య పై ఇప్పుడు విమర్శలు తలెత్తుతున్నాయి.
స్వర్గంలో ఆయన ఆత్మకు శాంతి లేదంటూ బాలయ్య పై నెటిజన్స్ ఫైర్..
“మద్యం ఆరోగ్యానికి హానికరం” అని ప్రభుత్వాలు నినాదాలు చేస్తుంటే.. అదే ప్రభుత్వంలో ఉన్న బాలయ్య మాత్రం ఇలా బ్రాందీని ప్రమోట్ చేయడం ఏంటి? అంటూ ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, 9 నెలల్లోనే ప్రజల మనసులు గెలుచుకొని, ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు.. ఆంధ్రప్రదేశ్లో తొలి కాంగ్రెసేతర పార్టీని స్థాపించి రికార్డు సృష్టించారు. అంతేకాదు ఎన్నో చట్టాలను అమలులోకి తీసుకొచ్చిన ఈయన.. ప్రజల కోసం ‘మద్యం నిషేధ చట్టాన్ని’ కూడా తీసుకొచ్చి, ప్రజల ఆరోగ్యమే ధ్యేయమని నిరూపించారు. అలాంటి గొప్ప వ్యక్తి వారసుడైన బాలకృష్ణ ఇలా మద్యాన్ని తాగండి అని యువతను ప్రోత్సహించడంపై అటు సోషల్ మీడియాలో కూడా వ్యతిరేకత ఎదురవుతోంది. బాలకృష్ణ ఈ బ్రాందీకి బ్రాండ్ ప్రమోటర్ గా మారారు అన్న విషయం తెలిసిన తర్వాత చాలామంది నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అందులో కొంతమంది..” బాలయ్యేమో ఇప్పుడు బ్రాందీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి, యువతను తాగండి అంటూ ప్రోత్సహిస్తున్నారు కదా.. కానీ గతంలో ఆయన తండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మాత్రం ఆ కాలంలో మధ్య నిషేధ చట్టాన్ని తీసుకొచ్చి, రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండేలా చేశారు. ఇప్పుడు బాలయ్య చేసిన పనిని చూసి.. స్వర్గంలో పెద్దాయనకు మనశ్శాంతి లేకుండా పోతోంది.. పెద్దాయన ఆశయాలకు బాలయ్య తూట్లు పొడుస్తున్నారు ” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.
ALSO READ:Karthik Dandu: రిపోర్టర్ కి డైరెక్టర్ కౌంటర్.. కాపీ మేము కాదు మీరే అంటూ..!