AR Rahman: ప్రముఖ సంగీత దర్శకులు, ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ (AR.Rahman)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన, అన్ని భాషలలో కూడా పనిచేసి మరింత పాపులారిటీ అందుకున్నారు. ఇకపోతే ఈమధ్య 29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ.. విడాకుల ప్రకటన చేయడం అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. ఇక విడాకుల ప్రకటన తర్వాత దయచేసి తమ గోప్యతకు భంగం కలిగించకండి అంటూ సోషల్ మీడియా ద్వారా వేడుకున్న విషయం తెలిసిందే.
గోవా IFFI-2024 ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఏఆర్ రెహమాన్..
ఇదిలా ఉండగా తాజాగా గోవా వేదికగా 55వ “ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా” వేడుక చాలా ఘనంగా జరిగింది. ఇక గురువారం రోజు జరిగిన ముగింపు వేడుకలలో చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ వేడుకలలో ఏ.ఆర్.రెహమాన్ కూడా పాల్గొని సందడి చేశారు. ఇకపోతే విడాకుల ప్రకటన తర్వాత తొలిసారి బహిరంగంగా కనిపించడంతో పలువురు మీడియా మిత్రులు కూడా ఆయనను ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేశారు. ఇకపోతే అందులో భాగంగానే తన అనారోగ్య సమస్య గురించి, ఆ సమయంలో తాను పడ్డ కష్టం గురించి తెలిపి అందరిని ఆశ్చర్యపరిచారు.
డిప్రెషన్ నుంచి బయటపడాలంటే అలా చేయాల్సిందే..
ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య డిప్రెషన్. అందుకే శారీరక అవసరాలపై శ్రద్ధ చూపడం మానేయాలని రెహమాన్ సలహా ఇచ్చారు. ఈరోజుల్లో ఎంతోమంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు. ఎందుకంటే వారు తమ జీవితంలో ఏదో ముఖ్యమైన దానిని కోల్పోయామనే భావనలో ఉంటున్నారు. జీవితమంతా శూన్యంగా మారిందనే భ్రమలో వారు జీవిస్తున్నారు. అయితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. దీని నుంచి బయటపడాలంటే ఇష్టమైన పని చేయడం,చదవడం, రాయడం లేదా సంగీతం వినడం లాంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అంటూ తెలిపారు. అంతేకాదు తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు తన తల్లి ఎలాంటి సలహా ఇచ్చింది అనే విషయాన్ని కూడా ఆయన తెలిపారు.
ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు అమ్మే కాపాడింది..
“నేను యుక్తవయసులో ఉన్నప్పుడు ఎన్నో ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయి. అయితే ఆ సమయంలో మా అమ్మ నాకు ఇచ్చిన సలహా నా జీవితాన్నే మార్చేసింది. “మనం ఇతరుల కోసం జీవించినప్పుడు, ఆత్మహత్య ఆలోచనలు రావు” అంటూ మా అమ్మ సలహా ఇచ్చింది. ఇక అప్పటి నుంచే నా ఆలోచనలలో మార్పులు వచ్చాయి. జీవితంలో అందుకున్న అత్యంత అందమైన గొప్ప సలహా కూడా ఇదే.మా అమ్మ చెప్పిన సలహా నా జీవితానికి ఎంతో సహాయపడింది. ముఖ్యంగా నేను మానసిక సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నాను..ఆ సమయంలో మా అమ్మ చెప్పిన ఈ సలహా ఎంతో సహాయపడింది” అంటూ తెలిపారు.
విడాకులపై తొలిసారి స్పందన..
అలాగే విడాకుల ప్రకటన గురించి కూడా మాట్లాడుతూ.. “మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాము. ఇప్పటికే మాకు ఒకరంటే ఒకరికి గౌరవం వుంది ” అంటూ తెలిపారు ఏ ఆర్ రెహమాన్.