Big Stories

M.S. Subbulakshmi : ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రం .. ఒక ధ్యానం

Share this post with your friends

M.S. Subbulakshmi

M.S. Subbulakshmi : ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి సెప్టెంబర్ 16, 1916లో మధురైలో లాయర్ సుబ్రహ్మణ్య అయ్యర్, వీణావాద్య విద్వాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్ కు జన్మించారు. చిన్నవయసులో ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవారు.

ఎంఎస్ సుబ్బలక్ష్మికి ఆది గురువు ఆమె తల్లే. పదేళ్ల నుంచే ఆమె సంగీత ప్రస్థానం ప్రారంభవ్వగా.. ఆమెలో భక్తిత్వ బీజం వేసింది మాత్రం తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్.

పాఠశాలలో ఒకరోజు టీచర్ అకారణంగా కొట్టడంతో చదువు మానేసి అన్నదమ్ములు, అక్కతో కలిసి సంగీత సాధనను ఎంచుకున్నారు. సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద శిక్షణ పొంది.. తనలోని ప్రతిభను బాహ్యప్రపంచానికి చూపించారు.

1933లో మద్రాస్ సంగీత అకాడెమీలో మొట్టమొదటి సంగీత కచేరి ప్రదర్శన ఇచ్చారు. 1938లో సేనా సదనం సినిమా ద్వారా ఆమె సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

1940లో ఆనంద వికటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్, స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది అయిన త్యాగరాజన్ సదాశివన్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు.

1940లో శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించారు. 1945లో మీరా చిత్రం పునర్నిర్మాణంతో ఎంఎస్ సుబ్బలక్ష్మి పేరు దేశమంతా మారుమోగింది. నటన, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి.

ఆమె గానం ధ్యానం. 10కి పైగా భాషల్లో ఎన్నో కృతులు, కీర్తనలు, శాస్త్రీయ, లలిత గీతాలు, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభంగాలు, దేశభక్తి గేయాలు పాడారు.

సంస్కృతభాషలో ఉండే భావం దెబ్బతినకుండా అలవోకగా పాడటం.. ఆమెకు దైవమిచ్చిన గొప్పవరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు బాణీలు కట్టిన పాటలకు ఎంఎస్ సుబ్బలక్ష్మి తన గాత్రంతో ప్రాణం పోశారు.

మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో, జె పీర్ పరాయీ జానేరే వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆమె.ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బలక్ష్మి.

న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బులక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి ఆమె ప్రశంసలు పొందింది.

తిరుమలతో పాటు.. ప్రతి ఇంట్లో ఉదయాన్నే వినిపించే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పాడింది ఎంఎస్ సుబ్బలక్ష్మినే. బ్రహ్మ కడిగిన పాదము, వాతాపి గణపతిం భజే, భజ గోవిందం మూడమతే కూడా ఆమె ఆలాపించిన కీర్తనలే.

1954లో భారతప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ ను, 1975లో పద్మ విభూషణ్ ను ప్రదానం చేసింది. 1965లో చెన్నై ది మ్యూజిక్ అకాడమి నుంచి సంగీత కళానిధి, 1971లో శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, 1974లో ఢిల్లీ యూనివర్సిటీ, 1980లో బెనారస్ యూనివర్సిటీ (యూపీ), 1987లో యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ (తమిళనాడు) నుంచి డాక్టరేట్లు అందుకున్నారు.

1998లో భారత ప్రభుత్వం ఎంఎస్ సుబ్బలక్ష్మికి భారతరత్న పురస్కారాన్ని అందించింది. భారతరత్న అందుకున్న తొలి స్త్రీ గాయకురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు.

2004లో ఢిల్లీ ప్రభుత్వం ఎంఎస్ సుబ్బలక్ష్మికి జీవిత సాఫల్య పురస్కారం (లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు)ను అందజేసింది. ఆ పురస్కారంతో పాటు బహుమతిగా వచ్చిన 11 లక్షల రూపాయలను స్వర్గీయ కంచి ఆచార్య చంద్రసేఖరరేంద్ర సరస్వతి స్మృతి కట్టడానికి విరాళంగా ఇచ్చారు.

2004, డిసెంబర్ 11న 88 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలు, న్యూమోనియా, హృదయ సంబంధిత సమస్యలతో ఎంఎస్ సుబ్బలక్ష్మి కన్నుమూశారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News