Bollywood Actor:సమంత (Samantha).. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న సమంత తన సినిమాలతోనే కాకుండా ఎంతోమందికి అవకాశాలు రావడంలో సహాయం చేస్తూ.. భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో తనకంటూ ఒక ఫేమ్ సొంతం చేసుకున్న కీర్తి సురేష్ (Keerthi Suresh) కు బాలీవుడ్ లో అవకాశాలు కనిపించి, ఆమె అరంగేట్రం చేయడానికి సహాయపడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఒక బాలీవుడ్ నటుడికి తెలుగులో అవకాశాలు కల్పించి, తన మంచి మనసు చాటుకుంది. ఈ విషయాన్ని ఆ బాలీవుడ్ నటుడు స్వయంగా వెల్లడించారు.
తెలుగులో నటించడం నా కళ- ఆదర్శ్ గౌరవ్..
ఆయన ఎవరో కాదు ఆదర్శ్ గౌరవ్ (Adarsh Gourav) ‘సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్’ అనే సినిమాతో ఇటీవల ప్రేక్షకులను అలరించారు. ‘డివైడ్ టైగర్’ సినిమాతో విశేష ఆదరణ సంపాదించుకున్న ఈయన.. హిందీలో దాదాపు 9 సినిమాల వరకు చేసి మంచి ఇమేజ్ దక్కించుకున్నారు. ముఖ్యంగా గన్స్ అండ్ గులాబ్స్, హాస్టల్ డేస్ వంటి వెబ్ సిరీస్లలో కూడా మెప్పించారు. తెలుగు వెండితెరకు పరిచయం కావాలని చాలా కాలంగా కలలు కంటున్న ఈయన దారి తెలియక బాలీవుడ్ లోనే ఆగిపోయారు. అలాంటి సమయంలోనే తనకు సమంత సహాయం చేసిందని, తన ఒత్తిడి వల్లే తాను తెలుగులో ప్రయత్నాలు చేసి ఇప్పుడు ప్రాజెక్ట్ దక్కించుకున్నానని ఆదర్శ్ తెలిపారు.
సమంత వల్లే తెలుగులో అవకాశాలు వస్తున్నాయి..
ఆదర్శ్ మాట్లాడుతూ.. నా మాతృభాష తెలుగు.. తెలుగు సినిమాల్లో పని చేయాలని ఎంతో కాలంగా అనుకుంటున్నాను. కానీ ఎవరిని సంప్రదించాలి? ఎలా అవకాశాలు అందుకోవాలి? అనే విషయాలేవీ కూడా నాకు తెలియదు. ఈ విషయంలో నేను సమంతకు థాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే సిటాడెల్ వెబ్ సిరీస్ పూర్తయ్యాక , ఆ యూనిట్ సెలబ్రేట్ చేసుకుంటున్న పార్టీకి నేను కూడా వెళ్లాను. అప్పుడు నాకు తెలుగులో పనిచేయాలని ఉందని సమంతాకు చెబితే , సరే టాలీవుడ్ లో జరిగే ఆడిషన్స్ కి వెళ్ళు అని నాపై ఒత్తిడి తీసుకొచ్చింది. కావాలంటే కొన్ని మీటింగ్స్ కి నేను కూడా సహాయం చేస్తాను అని తెలిపింది. ఇక తన మేనేజర్ సహాయంతోనే తెలుగులో చాలా మందిని కలిసి పలువురితో చర్చలు కూడా జరిపాను. అలా ఒక దర్శకుడు పరిచయమై, ప్రస్తుతం ఆయనతో సినిమా చేస్తున్నాను.. సైకలాజికల్ థ్రిల్లర్గా రాబోతోంది ఈ సినిమా.. నేను ఎక్కువగా అనురాగ్ కశ్యప్ దివాకర్ బెనర్జీ, జోయా అక్బర్, విక్రమాదిత్య మోత్వానే వంటి వారి సినిమాలే ఎక్కువగా చూశాను. అందులో వారు చూపించే పాత్రలు నిజజీవితంలో నాకు కనిపించినట్లే అనిపిస్తాయి. ఏది ఏమైనా సమంత వల్లే ఇప్పుడు నాకు తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. ఆమె నిజంగా గ్రేట్ అంటూ సమంత పై ప్రశంసలు కురిపించారు ఆదర్శ్.
మా ఇంట్లో తెలుగు మాత్రమే..
అలాగే ఆయన మాట్లాడుతూ..” నా చిన్నతనంలో మా ఇంట్లో ఒక కఠిన నియమం ఉండేది. బయట ఏ భాష అయినా మాట్లాడు కానీ ఇంట్లో మాత్రం తెలుగు మాత్రమే మాట్లాడాలి.. అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఆ భాష ఇప్పుడు నాకు ఎంతగానో ఉపయోగపడుతోంది. చిన్నప్పటి నుంచి తెలుగు మాట్లాడే ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఈ ఇండస్ట్రీకి నేను కొత్త. నాకు ఎవరూ తెలియకపోయినా ఆ భాష వల్ల అంతా ఒక్కటే అనే ఫీలింగ్ కలుగుతోంది” అంటూ తెలిపారు ఇకపోతే సినిమా గురించి.. టైటిల్ గురించి.. దర్శకుడు గురించి ఇలా ఏ విషయాలు కూడా ఆదర్శ్ వెల్లడించలేదు.