Brahmanda Movie:ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. మరి కొంతమంది సీనియర్ హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో సరిపెట్టుకుంటున్నారు. కానీ తమ నటనతో ఏదైనా నిరూపించగలమని మరో అడుగు ముందుకేస్తూ లేడీ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ ఆమని (Aamani)కూడా ఒకరు. సీనియర్ హీరోయిన్గా మంచి పేరు దక్కించుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెర షోలలో కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
అంతేకాదు ఈమధ్య సీరియల్స్ లో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాండ’. తాజాగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. మమత ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఆమని ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి సహనిర్మాతగా శ్రీమతి దాసరి మమత వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా మమత మాట్లాడుతూ..” పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇప్పుడు సినిమా ఫైనల్ మిక్సింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే ఆడియోని కూడా రిలీజ్ చేస్తాము” అని తెలిపారు.
నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ..” స్క్రిప్ట్ దశలో మేము అనుకున్నది అనుకున్నట్టుగా మాత్రమే కాదు అంతకుమించి చిత్రీకరించాడు. మా దర్శకుడు రాంబాబు ఇప్పటివరకూ ఎవరు చూడని కర్ణాటక, చత్తీస్గఢ్ లొకేషన్ లలో ఈ సినిమాను చిత్రీకరించాము. ముఖ్యంగా ఆమని, బలగం జయరాం, కొమరక్క సహకారం ఎప్పటికీ మరువలేనిది. ఆడియో రిలీజ్ అవ్వగానే సినిమా విడుదల చేస్తాము” అని ఆయన తెలిపారు.
అలాగే చిత్ర దర్శకుడు రాంబాబు కూడా మాట్లాడుతూ.. “తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒగ్గు కళాకారుల నేపథ్యంలో వారి సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఈ సినిమాని మేము తెరకెక్కిస్తున్నాము. ఒగ్గు అంటేనే శివుని చేతిలోని ఢమరుకం అని అర్థం. అయితే ఈ పదం కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీ పదం కూడా. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. యాక్షన్, డివోషనల్, థ్రిల్లర్ అన్ని అంశాలు కూడా ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి అంటూ తెలిపారు.