Farah Khan : ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ (Farah Khan) హిందువుల పండుగ ‘హోలీ’ గురించి చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీసాయి. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ తో మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ పలు హిందూ సంఘాలు ఆమెపై కేసు పెట్టాయి. ఈ నేపథ్యంలోనే హోలీ పండుగ గురించి అవమానకర వ్యాఖ్యలు చేసిందనే ఆరోపణలతో ఫరాపై క్రిమినల్ కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది.
అసలు ఏం జరిగింది అంటే?
ఫిబ్రవరి 20న ప్రముఖ టెలివిజన్ కుకింగ్ షో ‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్’ (Celebrity Master Chef) లేటెస్ట్ ఎపిసోడ్లో ఫరా ఖాన్ కొన్ని కామెంట్ చేసింది. ఫరా ఖాన్ మాట్లాడుతూ “హోలీ అనేది ఛాఫ్రీ అనే జనాలకు ఇష్టమైన పండుగ” అని చెప్పింది. దీంతో ఫరా కామెంట్స్ మతపరమైన వివాదానికి దారితీసాయి. ఇందులో వినడానికి కాంట్రవర్సీ ఏమీ లేనప్పటికీ, ఇండియాలో ఛాఫ్రి అనే పదాన్ని అవమానకరంగా లేదంటే తక్కువ స్థాయి వ్యక్తులను సూచించే పదంగా వాడుతుంటారు. అందుకే ఇప్పుడు హోలీ పండుగ విషయంలో ఆమె ఇలాంటి పదం వాడడమే ఫరా ఖాన్ ను చిక్కుల్లో పడేసింది.
ఆమె కామెంట్స్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకు పడుతున్నారు. హిందూ పండుగ హోలీని ఫరా అవమానించారని, ఈ కామెంట్స్ వల్ల మతపరమైన సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయని ఆరోపిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఫరాఖాన్, హోలీ కాంట్రవర్సీ వంటి హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాక్ ఫటక్ అనే వ్యక్తి తన లాయర్ అలీ ఖాసిం ఖాన్ దేశ్ ముఖ్ ద్వారా ఆమెపై కంప్లయింట్ దాఖలు చేశారు.
అందులో ‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్’ లో ఫరా ఖాన్ చేసిన హోలీ వివాదాస్పద కామెంట్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సంబంధించి ముంబైలోని ఖర్ పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ నమోదయింది. అతను కంప్లైంట్ లో “ఫరా ఖాన్ నా వ్యక్తిగత, మతపరమైన మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా, హిందూ సమాజాన్ని సైతం తన కామెంట్స్ తో అవమానపరిచింది. ఈ ఫిర్యాదు ద్వారా ఆమెపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను” అని ఫిర్యాదు చేశారు. అతని కంప్లయింట్ మేరకు పోలీసులు ఫరాపై క్రిమినల్ కేసు ఫైల్ చేసినట్టు సమాచారం.
వివాదంపై స్పందించని ఫరా
ఇదిలా ఉండగా, ప్రస్తుతం ‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్’లో ఫరా ఖాన్ జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ వివాదంపై ఆమె ఇంకా స్పందించలేదు. ఇక 1992లో సినిమా కెరియర్ ప్రారంభించిన ఫరా ఖాన్ దిల్ సే, బాంబే, దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే, కుచ్ కుచ్ హోతా హై వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కొరియోగ్రఫీ అందించింది. 2004లో ‘మైన్ హున్’ అనే షారుక్ ఖాన్ సినిమాతో డైరెక్టర్ గా మారింది. 2007లో ‘ఓం శాంతి ఓం’ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.