Case filed against RGV : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) పై తాజాగా ఏపీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. ఈయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా పలువురు వ్యక్తులు. రాజకీయ ప్రముఖులపై అసభ్యకర పోస్టులు పెడుతూ.. అభ్యంతరకర కామెంట్లు చేస్తూ.. ముఖ్యంగా వారి కుటుంబంలోని మహిళలపై అసహ్యకరమైన మార్ఫింగ్ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు ప్రముఖులుపై కేసులు కూడా నమోదయ్యాయి.
రాంగోపాల్ వర్మ కు నోటీసులు..
ముఖ్యంగా ఈ విషయంలో గొప్ప, పేద, ధనిక, చిన్నా, పెద్ద అనే తారతమ్యం లేకుండా.. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం వైసీపీ హయాంలో.. వైసీపీ నాయకుల కుటుంబంలోని మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని కూడా వదిలేది లేదని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు (CM Nara Chandrababu Naidu) తెలిపారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. వైసిపి ప్రభుత్వం హయాంలో రాంగోపాల్ వర్మ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లతో పాటు వారి కుటుంబ సభ్యులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అంటూ.. మండల టిడిపి కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు.
ఒంగోలు నుంచి హైదరాబాద్ బయలుదేరిన పోలీసులు..
దీంతో మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవ్వగా.. కేసు విచారణకు హాజరుకావాలని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు నోటీసులు సిద్ధం చేశారు పోలీసులు. ఈ మేరకు ఏఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలోని బృందం ఒంగోలు నుంచి హైదరాబాదుకు బయలుదేరింది. మంగళవారం రాత్రి ఒంగోలు నుంచి హైదరాబాద్ బయలుదేరిన పోలీసులు బుధవారం ఆర్జీవికి నోటీసులు అందజేసే అవకాశం ఉందని సమాచారం. ఇకపోతే ఏ విషయం తెలిసి నెటిజన్స్ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
వ్యూహం సినిమా సమయంలో..
ఇకపోతే రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం (Vyuham) సినిమా చంద్రబాబు నాయుడు ,పవన్ కళ్యాణ్ లకు వ్యతిరేకంగా తెరకెక్కించింది. ముఖ్యంగా ఎలక్షన్ టైం లో ఈ సినిమా తీయడమే కాకుండా వీరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు వర్మ. ఇప్పుడు ఆ ప్రతీకారం తీర్చుకునే టైమ్ వచ్చింది అంటూ టిడిపి కార్యకర్తలు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి రాంగోపాల్ వర్మ ఎప్పుడూ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ విషయంపై ఆయన అటు పోలీసులను, ఇటు ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
వర్మతోపాటు శ్రీరెడ్డి, పోసానిపై ఫిర్యాదు..
ఇప్పుడు ఈయనతోపాటు శ్రీరెడ్డి , పోసాని కృష్ణమురళి పై కూడా ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, లోకేష్, వంగలపూడి అనిత , పవన్ కళ్యాణ్ లను దుర్భాషలాడుతున్న శ్రీరెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో తెలుగు మహిళా సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది.
రాంగోపాల్ వర్మ కు నోటీసులు అందించిన పోలీసులు..
తాజాగా ఒంగోలు నుంచి బయలుదేరి రాంగోపాల్ వర్మ ఇంటికి చేరుకున్న పోలీసులు, ఆయనకు నోటీసులు అందించారు.