Actress Kasrhuri: తెలుగు ప్రజలు తమిళనాడులో భాగమేనని మదురై ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చెన్నై ఎగ్మూర్ లో జరిగిన ఆందోళనలో నటి కస్తూరి తెలుగు ప్రజలపై చేసిన కామెంట్లు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై మదురై తిరునగర్ లో నాయుడు మహాజన్ సంఘం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరగ్గా.. నటి కస్తూరి తరఫున మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, సూచించిన వర్గానికి చెందిన వారిపై మాత్రమే మాట్లాడారని, ఈ విషయమై వివరణ ఇచ్చి, క్షమాపణలు కోరిన తర్వాత కూడా కేసు నమోదైందని పేర్కొన్నారు.
రాజకీయ దురుద్దేశంతోనే ఈ వ్యవహారంలో 24 గంటల్లో చాలా కేసులు నమోదయ్యాయని పేర్కొంది. క్షమాపణ కోరిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఉందని, ఆమెను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని వాదించారు. దీంతో విద్యావంతురాలు, సామాజిక కార్యకర్త అని చెప్పుకునే పిటిషనర్ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు.
క్షమాపణ వీడియోలో తాను చేసిన వ్యాఖ్యలు న్యాయమైనవన్నట్లు ఉందని కానీ ఆమె విచారం వ్యక్తం చేయలేదని అభిప్రాయపడ్డారు. ఆ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల నుంచి తొలగించడానికి ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫున ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని అన్నారు. ఇతరులకు ఇది పాఠంగా ఉండాలని కోర్టుకు సూచించారు. ఇరువురి తరఫు వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేశారు. మరో కేసు విచారిస్తున్న సమయంలో హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నటి కస్తూరి హాజరయ్యారు. వీడియో ఆఫ్ చేసి మైక్ మాత్రమే ఆన్‌లో ఉంచి ఆమె మాట్లాడినట్లు తెలిసింది.