Toilet Time Health Risks| ఈ మధ్యకాలంలో చాలామంది టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారని.. దీని వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మొలలు, పెల్విక్ (వెనెముక కింది భాగం) కండరాల బలహీనమయ్యే ప్రమాదముందని చెబుతున్నారు. ఈ సమస్యలు రావడానికి ముఖ్య కారణాలను పరిశీలిస్తే.. చాలామంది టాయిలెట్ లో సెల్ ఫోన్స్ తీసుకెళుతున్నారని.. దాంతో 10 నిమిషాల కంటే తక్కువ సమయం గడపాల్సిన చోట దాదాపు 20 నిమిషాలకు పైగా టాయిలెట్ లో అదే భంగిమలో కూర్చొని ఉండిపోతున్నారని తేలింది. ఇలా చేయడం వల్ల పైకి ఆరోగ్య సమస్యలు తెలియకపోయినా.. ఈ అలవాటు ఉన్నవారు క్రమంగా అనారోగ్యానికి గురవుతున్నారని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్ వెస్ట్రన్ మెడికల్ సెంటర్ లో కొలోరెక్టల్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ లాయి జూయి తెలిపారు.
డాక్టర్ లాయి జూయి ఈ సమస్య విశ్లేషిస్తూ.. “టాయిలెట్ లో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపకూడదు. ముఖ్యంగా వెస్టరన్ టాయిలెట్ అలవాటు ఉన్నవారే ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తెలిసింది. ఎందుకంటే వెస్టరన్ టాయిలెట్ అలవాటు ఉన్నవారు కుర్చీ లాంటి భంగిమలో సౌకర్యంగా మలవిసర్జనకు అలవాటు పడ్డారు. దీంతో అలా కూర్చొనే సమయంలో కొంత మంది న్యూస్ పేపర్లు చదవడం, సెల్ ఫోన్ లో వీడియో చూడడం వంటివి చేస్తుంటారు. దీంతో వారు ఎక్కువ సమయం అలా కూర్చొనుండిపోతారు. దీనివల్ల రక్త ప్రసరణ గుండెకు చేరడం కష్టంగా మారుతుంది.
Also Read: కప్పలు తింటే ఇన్నిఆరోగ్య లాభాలున్నాయా?
ఫలితంగా గుండె ఎక్కువ ఒత్తిడితో పనిచేయాల్సి ఉంటుంది. పొత్తి కడుపు, వెనెముక రక్త నాళాలన్నీ కిందవైపునకు ఎక్కువ సమయం ఉండడంతోనే రక్త ప్రసరణ గుండెకు సరిగా జరగదు. వెస్టరన్ టాయిలెట్ లో ఓవల్ షేప్ లో కుర్చీ ఉండడంతో పెల్విక్ కండరాలపై ఒత్తిడి ఉంటుంది. అలాంటి సమయంలో ఎక్కువ సమయం అలా కూర్చొనుండి పోతే రక్తం శరీరం పై భాగానికి వెళ్లకపోవడంతో రక్త నాళాల్లో వాపు కలిగి మొలల సమస్య వచ్చే ప్రమాదముంది. దీంతో పాటు రెక్టల్ ప్రొలాప్స్ (మల విసర్జన చేసే పేగుతో కొంత భాగం కడుపులో కింది వైపుకి జారిపోతుంది) ప్రమాదం కూడా పొంచి ఉంది. ముందుగానే మొలలు, సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఆ సమస్యలు ఇంకా తీవ్రమవుతాయి.” అని డాక్టర్ లాయి తెలిపారు.
అమెరికాలోని న్యూయార్క్ నగరం స్టోనీ బ్రూక్ మెడిసిన్ సంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఫరా మొన్‌జూర్, కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలో ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అయిన డాక్టర్ ల్యాన్స్ ఉరాడోమో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. “టాయిలెట్ కు వెళ్లి సెల్‌ఫోన్ చూస్తూ కూర్చునే వారికి ఎక్కువ టైమ్ గడిచిపోయినట్లు తెలియదు. అదే భంగిమలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వారి పెల్విక్ కండరాలు బలహీనమవుతాయి.” అని డాక్టర్ ఫరా మొన్‌జూర్ చెప్పారు.
“అసలు టాయిలెట్ లోపలికి న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు, సెల్ ఫోన్స్ తీసుకెళ్లే అలవాటు మానుకోవాలి. బాత్రూమ్, టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడపే మానసిక ధోరణికి దూరంగా ఉండాలి. ఈ అలవాటుతో ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు.. వైద్యుల సూచనలు పాటిస్తూ.. ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, నీరు ఎక్కువ తాగాలి. మలబద్ధకం, మల విసర్జన చేయడంలో నొప్పి ఉన్న వారు మూడు వారాల కంటే ఎక్కువ సమయం ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే వైద్యులను తప్పకుండా సంప్రదించాలి. లేకపోతే సమస్య తీవ్రమై మలవిసర్జన సమయంలో రక్త స్రావం అయ్యే ప్రమాదముంది” అని డాక్టర్ ల్యాన్స్ ఉరాడోమో అభిప్రాయపడ్డారు.