Chhaava Trailer: ఈరోజుల్లో హీరోలు లేదా హీరోయిన్లు చాలావరకు తమకు అలవాటు అయిన సినిమాలు, పాత్రలు చేయకుండా ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాగే బాలీవుడ్‌లో వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న విక్కీ కౌశల్ కూడా తన ప్రతీ సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ వస్తున్నాడు. తాజాగా తను హీరోగా భారీ బడ్జెట్ హిస్టారికల్ సినిమా తెరకెక్కింది. అదే ‘ఛావా’. చాలాకాలం క్రితమే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా అందులో విక్కీ కౌశల్ విశ్వరూపం చూపించాడు.
ఛావా వచ్చేస్తున్నాడు
‘దక్కన్‌కు శివుడు, మరాఠాకు ఛత్రపతి అయిన వ్యక్తి ఈ ప్రపంచం నుండి వెళ్లిపోయారు’’ అని వచ్చే బ్యాక్‌గ్రౌండ్ డైలాగ్‌తో ‘ఛావా’ ట్రైలర్ మొదలవుతుంది. ‘‘ఇప్పుడు మరాఠా రాజ్యం కూడా మొఘలులకే సొంతమవుతుంది’’ అని అనగానే.. ‘‘పులి చనిపోయి ఉండవచ్చు కానీ ఛావా మాత్రం ఇంకా అడవిలోనే తిరుగుతోంది’’ అనే డైలాగ్‌తో విక్కీ కౌశల్ ఇంట్రడక్షన్ జరుగుతుంది. ‘‘మరాఠాలకు విరుద్ధంగా రావాలని ప్రయత్నిస్తే మొఘలుల ఛాతిని చీలుస్తాం’’ అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో విక్కీ కౌశల్ యుద్ధ రంగంలోకి అడుగుపెడతాడు. మేము శబ్ధం చేయము, నేరుగా వేట మొదలుపెడతాం అంటూ ఛత్రపతి సాంభాజీ మహారాజ్‌గా విక్కీ అందరికీ వార్నింగ్ ఇస్తాడు.
మరాఠా వర్సెస్ మొఘల్స్
ఛావా భార్యగా రష్మిక మందనా ఎంట్రీ కూడా ట్రైలర్‌లో చాలా గ్రాండ్‌గా చూపించారు. తన భర్త సామర్థ్యాన్ని పూర్తిగా నమ్మే యేసుబాయ్ పాత్రలో రష్మిక కనిపించింది. సాంభాజీ మహారాజ్‌ను చంపిన తర్వాతే మళ్లీ కిరీటాన్నిపెట్టుకుంటానంటూ మొఘలుల రాజు శపథం చేస్తాడు. అలా మొఘలుల మధ్య, మరాఠా సామ్రాజ్యపు రాజు మధ్య యుద్ధం మొదలవుతుంది. మరాఠా రాజ్య ప్రజలను చంపేస్తూ వస్తాడు మొఘల్ రాజు. చివరికి రాజుగా తన రాజ్యాన్ని కాపాడడం కోసం చనిపోయే ముందు కూడా మొఘలులకు సవాల్ విసురుతాడు ఛావా. ఇక ‘ఛావా’ ట్రైలర్ చివర్లో విక్కీ కౌశల్ సింహంతో ఫైట్ చేసే సీన్ హైలెట్‌గా నిలిచింది. దాంతోనే ట్రైలర్ కూడా ముగిసింది.
Also Read: అందుకే ఇల్లు అమ్మేసుకున్నా.. పాపం కంగనాకు ఎంత కష్టమొచ్చింది..!
హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో
‘ఛావా’ (Chhaava) సినిమాలో విక్కీ కౌశల్ (Vicky Kaushal)కు జోడీగా రష్మిక మందనా (Rashmika Mandanna) నటించగా అక్షయ్ ఖన్నా, అశితోష్ రానా, డయానా పెంటీ, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పూర్తిగా హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా సినిమాకు ఎంత ప్రాణంగా నిలుస్తుందో ట్రైలర్‌లో కనిపిస్తోంది. ఇప్పటివరకు విక్కీ కౌశల్ ఎక్కువగా యూత్‌కు కనెక్ట్ అయ్యే సినిమాల్లోనే నటించాడు. అలాంటిది మొదటిసారి ఒక హిస్టారికల్ భారీ బడ్జెట్ మూవీతో ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయడానికి వచ్చేస్తున్నాడు. ఎన్నో వాయిదాల తర్వాత ఫిబ్రవరీ 14న ‘ఛావా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.