Betting Apps Case :బెట్టింగ్.. బెట్టింగ్.. బెట్టింగ్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. పేరున్న సెలబ్రిటీలు సైతం ప్రజలకు మంచి చేయడం మరిచిపోయి.. లాభార్జన కోసం ప్రజల ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆదాయాన్ని పెంచుకోవడం కోసం.. తప్పు అని తెలిసినా సరే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ.. భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. ఒకరేమో రోడ్లపై డబ్బులు విసిరేస్తారు.. ఇంకొకరేమో తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేసి, ఆ వస్తువును కొనాలంటే ఇలా గేమ్ ఆడితే చాలు అని చూపిస్తారు.. ఇంకొంతమంది ఏమో తమ భార్యలకు ఏకంగా క్రెడిట్ కార్డులు ఇచ్చేసి షాపింగ్ చేసుకోమని చెబుతారు. అయితే ఈ డబ్బంతా వారికి ఎక్కడిది? ఆ డబ్బు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారో లెక్కలు చూపించగలరా..? అసలు ఇలాంటి వాళ్లని లోపలేసి తొక్కితే.. అసలు కలుగులో ఉన్న ఎలుక బయటకి వస్తుంది.. అంటూ చెబుతున్నారు చీకోటి ప్రవీణ్ (Chikoti Praveen).
బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రజల డబ్బు టెర్రరిస్టులకు వెళ్తోంది..
తాజాగా బిగ్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో.. ఆయన ఈ బెట్టింగ్ యాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ పై, అలాగే బెట్టింగ్ భూతానికి బానిస అయ్యి జీవితాలను కోల్పోతున్న యువత గురించి మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇంటర్వ్యూలో భాగంగా చీకోటి ప్రవీణ్ మాట్లాడుతూ.. “ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఈ బెట్టింగ్ లో ఒక్కసారి ఆడడం మొదలు పెట్టారంటే.. ఇక దాని నుంచి బయటపడడం అసాధ్యం. ఈ ప్రపంచంలో ఎవరూ కూడా గ్యాంబ్లింగ్స్ లో ఆడి గెలిచినవాడు ఒక్కడు కూడా లేడు. వెయ్యి మందిలో పదిమంది మాత్రమే.. అందులోనూ ఒక్కసారి మాత్రమే గెలుస్తారు. ఇక ప్రతిసారి ఎప్పటికప్పుడు ప్యాట్రన్ మారిపోతుంది. కొన్ని లక్షల మంది దీనికోసం పనిచేస్తున్నారు. ఈ డబ్బు అంతా దేశం దాటి ఇతర దేశాలలోని టెర్రరిస్టుల చేతికి వెళ్లిపోతోంది. ఆ టెర్రరిస్టులు మళ్ళీ ఆయుధాలు తయారు చేసి మనపైనే దాడి చేస్తున్నారు.
వీళ్లను కొడితే, మూలాలు బయటపడతాయి..
దయచేసి ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి.. ముఖ్యంగా చాలామంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారు తమ కోసమే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. ప్రజల కోసం వారు ఆలోచించడం లేదు. కనీసం సామాజిక బాధ్యత కూడా వాళ్లకు లేదు. ఇప్పుడేమో మేము తప్పు చేశాము.. తెలియక చేసాము అంటూ పోలీసుల ముందు నేరం ఒప్పుకుంటున్నారు కానీ కనీసం ఇప్పటికైనా ప్రజల కోసం ఆలోచిస్తున్నారా అంటే.. అదీ లేదు. ఎందుకంటే సారీ చెప్పకపోతే మళ్లీ పోలీస్ కేసులో ఇరుక్కొని, ఇంకెన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో అనే భయంతోనే వారు ఇలా చేస్తున్నారు. ఒకసారి కేస్ ఫైల్ చేసి వదిలేయడం కాదు.. ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ను ఇండియాలో ప్రమోట్ చేయడం కోసం మనవాళ్లే ఇక్కడ కొంతమంది సహాయం చేస్తున్నారు. అలాంటి వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ను ఎవరు ప్రమోట్ చేయమని వీరికి డబ్బు ఇస్తున్నారు అనే వారిని పట్టుకుంటే.. అసలు కథ బయటకి వస్తుంది. పొగ పెడితే కలుగులోని ఎలుక బయటికి వచ్చినట్లు.. ఈ బెట్టింగ్ భూతాన్ని తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని అసలు మూలం ఎక్కడుందో చేదించగలిగితే ఇక బెట్టింగ్ భూతం ఇండియా నుండి పారిపోతుంది. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోతోంది ” అంటూ చీకోటి ప్రవీణ్ తెలిపారు. అంతేకాదు మరెన్నో విషయాలను పంచుకున్న ఆయన ఎక్స్క్లూజివ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న దాదాపు 11 మంది సెలబ్రిటీలపై కేసు ఫైల్ అయ్యింది.