India’s Got Latent Show : సమయ్ రైనా (Samay Raina) సోషల్ మీడియాలో స్టాండ్-అప్ కమెడియన్ గా ఫుల్ పాపులర్ అయ్యాడు. ఇటీవల అతను అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్ చేస్తున్న పాపులర్ షో KBCలో కూడా కనిపించాడు. అయితే మరోవైపు ఇతని పాపులర్ షో ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ తరచుగా వివాదాస్పదం అవుతుంది. తాజాగా ఈ షోలో పాల్గొన్న ఒక కంటెస్టెంట్ వివాదాస్పద కామెంట్స్ చేయడంతో అరుణాచల్ ప్రదేశ్‌లో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో మరోసారి ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ (India’s Got Latent Show) షో వార్తల్లో నిలిచింది.
వివాదం ఏంటంటే?
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన జైస్వాల్ నబమ్ అనే అమ్మాయి సమయ్ రైనా షో ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ (India’s Got Latent Show)లో తన సొంత రాష్ట్రం గురించి వివాదాస్పద కామెంట్స్ చేసింది. షో సమయంలో రైనా… కంటెస్టెంట్ జైస్వాల్ ను “కుక్క మాంసం తిన్నావా ?” అని అడిగాడు. ఆమె లేదని చెప్పింది. అక్కడితో సమాధానం ఆపి ఉంటే, వివాదం అయ్యేది కాదేమో. కానీ ఆ తరువాత జైస్వాల్ చేసిన కామెంట్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైస్వాల్ మాట్లాడుతూ “నా స్నేహితులు తమ పెంపుడు జంతువులను వండుకుని తింటారు” అని చెప్పింది. జైస్వాల్ నబమ్ చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇప్పుడు ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ షోలో కంటెస్టెంట్ జైస్వాల్ చేసిన ఆ కామెంట్స్ పై అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. జైస్వాల్ చేసిన ఆ కామెంట్స్ తప్పు అని, అరుణాచల్ ప్రదేశ్ స్థానిక ప్రజలను అవమానించేలా ఆమె మాట్లాడిందని ఆరోపిస్తూ ఆ ఎఫ్ఐఆర్ ను సదరు వ్యక్తి ఫైల్ చేసినట్టు తెలుస్తోంది. అయితే సమయ్ రాజ్ షోలో ఇలాంటి వివాదాస్పద విషయాలు చాలానే జరుగుతాయి. చాలా మంది ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ కంటెస్టెంట్స్ ఇతరులను బాధపెట్టే పనులు చేస్తారు అనే టాక్ కూడా ఉంది. అయినప్పటికీ ఈ షోను యూట్యూబ్‌లో లక్షలాది మంది వీక్షిస్తున్నారు.
అతిథిపైనే బాడీ షేమింగ్ కామెంట్స్
సమయ్ రైనా షో ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ (India’s Got Latent Show) కొన్నాళ్ళ క్రితం మరో వివాదంలో చిక్కుకుంది. ఈ షోకు సోషల్ మీడియా సంచలనం ఉర్ఫీ జావేద్ (Urfi Javed) అతిథిగా విచ్చేసింది. ఆ టైమ్ ఇద్దరు కంటెస్టెంట్స్ ఆమెపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో షో నుంచి మధ్యలోనే ఉర్ఫీ వెళ్లిపోయిందట. ఈ వివాదంపై ఉర్ఫీ సోషల్ మీడియా వేదికగా మౌనాన్ని వీడి, షో నుంచి ఎందుకు వాకౌట్ చేసిందో వెల్లడించింది. ఉర్ఫీని ఓ కంటెస్టెంట్ మియా ఖలీఫాతో పోల్చాడని, మరో వ్యక్తి అవమానకర కామెంట్స్ చేశారని వెల్లడించింది. అయితే అక్కడున్న జనాలు ఆ అవమానాన్ని ఖండించకుండా ఎంజాయ్ చేస్తుండడంతో, తాను అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా వచ్చేశానని అసహనాన్ని వ్యక్తం చేసింది.