Comedian:ఒక మనిషి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. ఓడలు తెప్పలు అవ్వచ్చు.. తెప్పలు ఓడలవచ్చు.. అంతా తలరాత పైన ఆధారపడి ఉంటుంది. అయితే ఆ తలరాతను కూడా మారుస్తూ.. కష్టపడే తత్వంతో పాటు కాస్త ఆవగింజంత అదృష్టం ఉంటే వందల కోట్లే కాదు వేల కోట్లకు కూడా అధిపతి అవ్వచ్చు. సరిగ్గా ఇలాంటి ఒక కమెడియన్ ఇండస్ట్రీలోకి రాకముందు ఒక దాబాలో ప్రతిరోజు చపాతీలు చేసి అమ్మేవాడు. అలా రోజుకి 150 రూపాయల సంపాదనతో కెరీర్ ఆరంభించిన ఆయన.. అనూహ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, కమెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకొని, నేడు రూ.150 కోట్లకు అధిపతి అయ్యారు. మరి ఆ కమెడియన్ ఎవరు? ఆయన పడ్డ కష్టం వెనుక ఉన్న కథ ఏంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
ఒకప్పుడు చపాతీలు అమ్ముతూ.. రోజుకీ రూ.150 కూలీ..
ఆయన ఎవరో కాదు ప్రముఖ భోజ్ పురి నటుడు సంజయ్ మిశ్రా (Sanjay Mishra). 1963 అక్టోబర్ 6న బీహార్ లోని దర్భంగాలో నారాయణపూర్ లో జన్మించారు. సంజయ్ మిశ్రా తండ్రి శంభునాథ్ మిశ్రా (Shambhunath Mishra). ఈయన ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉద్యోగిగా పనిచేసేవారు. ఇక ఆయన బదిలీ అయినప్పుడు సంజయ్ మిశ్రా కూడా వారణాసికి వెళ్లిపోయారు. ఇక అక్కడ కేంద్రీయ విద్యాలయ బీహెచ్ఈఓ చదువుకున్నారు. ఆ తర్వాత కాలంలో సొంత సంపాదన మీద నిలబడాలని అనుకున్న సంజయ్ మిశ్రా.. అందులో భాగంగానే తన ఖర్చుల కోసం దాబాలో పనిచేసే వారట. అలా రోజుకి 150 రూపాయలు కూలీలా పని చేసినట్లు సమాచారం. ఇక తర్వాత యాక్టింగ్ లోకి వెళ్లాలనుకున్న ఈయన. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో చేరి 1989లో పట్టభద్రుడు అయ్యాడు. ఈయన 1995లో వచ్చిన ‘ఓ డార్లింగ్! ఏ హై ఇండియా!’ అనే సినిమా ద్వారా నటుడుగా ఇండస్ట్రీకి అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 1996లో వచ్చిన ‘రాజ్ కుమార్’, 1998లో వచ్చిన ‘సత్య’ సినిమాలలో నటించారు. ఇక అలాగే 1999 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా ఈఎస్పిఎన్ స్టార్ స్పోర్ట్స్ ఉపయోగించిన ఐకాన్ అయిన ఆపిల్ సింగ్ గా ఆయన కనిపించారు. ముఖ్యంగా చలనచిత్ర నిర్మాణాలలో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రసిద్ధ పేరును సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు రూ.150 కోట్లకు అధిపతి..
ఇక ఈయన ఇండస్ట్రీలోకి రాకముందే ఎక్కువగా వాణిజ్య ప్రకటనలు చేశారు. ఇక 1991లో ‘చాణక్య’ అనే టెలివిజన్ సిరీస్ షూటింగ్లో తన మొదటి రోజున 28 టేకులు తీసుకున్నట్లు తెలిపారు. ఆ దర్శకుడు షూటింగ్ కోసం రిహార్సల్స్ చేయడానికి ఆయనను ఒక అసిస్టెంట్ దగ్గర వదిలేశాడట. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సినిమాలే కాదు సీరియల్స్ అలాగే సిరీస్లలో కూడా నటించి తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు. ఇక తెలుగులో 2015లో వచ్చిన ‘శంకరాభరణం’ అనే సినిమాలో నటించిన ఈయన, అదే ఏడాది ‘కిక్ 2’ సినిమాలో కూడా నటించి ఆకట్టుకున్నారు. సుమారుగా 60 కి పైగా సినిమాలలో నటించిన ఈయన, అంతకుమించి టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించారు. అంతేకాదు ‘ది లయన్ కింగ్’ లో హిందీ భాష ఆడియో కోసం పుంబా కోసం తన గాత్రాన్ని కూడా అందించారు. ఇక అంతే కాదు తన నటనతో ఫిలింఫేర్, జీ సినీ అవార్డులను కూడా అందుకున్నారు. ఇప్పుడు వరుస సినిమాలు, సీరీస్ లు, వాణిజ్య ప్రకటనలు అంటూ సుమారుగా రూ.150 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం. ఏది ఏమైనా పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని మరొకసారి నిరూపించారు సంజయ్ మిశ్రా. ప్రస్తుతం సంజయ్ మిశ్రాకు సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.