Manchu family: గత రెండు మూడు రోజులుగా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఏకైక అంశం మంచు ఫ్యామిలీ (Manchu family)లో గొడవలు. తండ్రీ కొడుకుల మధ్య గొడవలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో తన కొడుకు, భార్యతో పాటు తనపై దాడి చేశారని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ (Manchu Manoj)నిన్న ఫిర్యాదు చేయగా.. మరొకవైపు మోహన్ బాబు(Mohanbabu) తన కొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మంచు మనోజ్ క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఏ విషయంలో కూడా అంత త్వరగా నిర్ణయాలు తీసుకోరు. ముఖ్యంగా ఎవరిని కూడా నిందించరు.అలాంటి ఈయనపై మోహన్ బాబు కేసు పెట్టడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
దాడిలో తీవ్రంగా గాయపడ్డ మనోజ్..
మరోవైపు తనపై జరిగిన దాడిలో.. మంచు మనోజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరడం, మెడకి కట్టు, కాలికి గాయంతో నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ భార్య, స్నేహితుల సహాయంతో ఇంటికి వెళ్లడంతో ఈ విషయాలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. ఇకపోతే ఈ పరిణామాలతో కుటుంబంలో ఏదో జరుగుతోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మోహన్ బాబు కుమారుడు విష్ణు(Vishnu)దుబాయ్ లో ఉండగా.. ముంబైలో ఉన్న లక్ష్మీ ప్రసన్న(Lakshmi Prasanna)కూడా ఈ విషయం తెలుసుకొని హుటాహుటిన హైదరాబాద్ కి వచ్చి వెళ్ళిపోయింది.
ఆస్తుల విషయంలోనే గొడవలు..
మరొకవైపు మోహన్ బాబు నివాసానికి మంచు విష్ణు తరుఫున 40 మంది బౌన్సర్లు, మనోజ్ తరఫున 30 మంది బౌన్సర్లు చేరుకోవడంతో అసలు ఏం జరుగుతోంది? అనే ఆందోళన కూడా నెలకొంది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆస్తుల పంపకం ఈ కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ విద్యానికేతన్ తోపాటు మోహన్ బాబు యూనివర్సిటీ తదితర సంస్థల అప్పగింతలకు సంబంధించి, మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి అనేది ఫిలింనగర్లో చెక్కర్లు కొడుతున్న ఇన్సైడ్ టాక్. గతంలో మోహన్ బాబు ఒక రోజున రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కనిపించడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.
ఆస్తి పంపకాలపై మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉండగా మరొకవైపు కొన్ని రోజుల క్రితం ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస్తుల పంపకంపై కూడా మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నా ముగ్గురు బిడ్డలకు ఆస్తులను సమానంగా పంచుతానని, అయితే లక్ష్మికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని, దీంతోపాటు మనవరాళ్ళు అంటే కూడా చాలా ఇష్టం అని మోహన్ బాబు స్పష్టం చేశారు. అంతేకాదు ఆడపిల్లలు ధైర్యంగా జీవించాలని, పిరికిపందల్లా బ్రతక కూడదని, ఎవడైనా వచ్చి చేయి పట్టుకుంటే పళ్ళు రాలిపోయేలా వాడికి చావు దెబ్బ రుచి చూపించాలని కూడా మోహన్ బాబు తెలిపారు. అంతేకాదు తన విద్యాసంస్థల్లోని ఆడపిల్లలకి కూడా తాను అదే చెబుతానని వెల్లడించారు మోహన్ బాబు. అందుకే తన బిడ్డను, మనవరాళ్లను అలాగే పెంచుతున్నాను అంటూ తెలిపారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఆస్తి గొడవలు వస్తున్నాయని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఇదే జరిగితే తన ఆస్తి మొత్తాన్ని మంచు లక్ష్మీ ప్రసన్నకి రాసిస్తారు అనడంలో సందేహం లేదు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.. మరి ఏం జరుగుతుందో చూడాలి.