David Warner: పరభాష వాళ్లు తెలుగు రాష్ట్రాలకు వస్తే ఆ మర్యాద మామూలుగా ఉండదు అంటుంటారు. అలాగే పరభాషా నటీనటులు తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టినా వారికి అదే రేంజ్‌లో మర్యాద దక్కుతుందని ఇప్పటికే చాలామంది నటీనటులు తెలిపారు. కానీ తాజాగా డేవిడ్ వార్నర్ విషయంలో మాత్రం అలా జరగలేదు. నటీనటులు తమతో పనిచేసే కో యాక్టర్స్ దగ్గర చనువుతో ఏమైనా మాట్లాడవచ్చు. కానీ అవతలి వ్యక్తికి భాష రాకపోతే ఏంటి పరిస్థితి.? అదే ఆదివారం ‘రాబిన్‌హుడ్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో జరిగింది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్‌ను ఈ మూవీ ప్రమోషన్స్ కోసం పిలిచి ఆయనను అవమానించడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
రంగంలోకి వార్నర్
భాష తెలిసిన వారిని ప్రేమగా ఎంతైనా తిట్టవచ్చు. కానీ భాష రాకపోతే సరదాగా అనే మాటలు కూడా బూతుల్లాగే అనిపిస్తాయి. ‘రాబిన్‌హుడ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ చేసింది ప్రేక్షకులకు అలాగే అనిపించింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాబిన్‌హుడ్’ కోసం ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను రంగంలోకి దించారు మేకర్స్. ఇప్పటికే వార్నర్‌కు, టాలీవుడ్‌కు విడదీయలేని అనుబంధం ఉంది. అలాంటిది తను ఒక తెలుగు సినిమాలో క్యామియో చేస్తున్నాడు అనగానే ప్రేక్షకులు చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలయ్యారు. అందుకే తను నటించిన సినిమా ప్రమోషన్స్ కోసం తనను నేరుగా రంగంలోకి దించింది ‘రాబిన్‌హుడ్’ టీమ్.
స్టేజ్‌పైనే బూతులు
‘రాబిన్‌హుడ్’ (Robinhood) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా నుండి వచ్చాడు. నితిన్, శ్రీలీలతో కలిసి ఈవెంట్‌లో సందడి చేశాడు. అందరికోసం ‘పుష్ప’ సినిమాలోని శ్రీవల్లి స్టెప్ వేసి చూపించాడు. కేతిక శర్మతో కలిసి ‘అదిదా సర్‌ప్రైజ్’ పాట సిగ్నేచర్ స్టెప్ వేశాడు. అంతా బాగానే ఉంది డేవిడ్ వార్నర్ ఆ ఈవెంట్‌కు వచ్చాడనేది ప్రేక్షకులు సైతం ఎంజాయ్ చేశారు. కానీ అంతలోనే వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చాలామందికి నచ్చలేదు. సినిమా గురించి మాట్లాడడానికి స్టేజ్‌పైకి వచ్చిన రాజేంద్ర ప్రసాద్.. డేవిడ్ వార్నర్‌ను తెలుగులో ముద్దుగా తిట్టాలనుకునే క్రమంలో తనపై బూతులు ఉపయోగించారు.
Also Read: వార్నర్ మామ వచ్చినా.. రాబిన్‌హుడ్ క్లీన్ బోల్డ్.?
సమర్థించడం లేదు
డేవిడ్ వార్నర్ (David Warner)ను దొంగ నా కొ*** అంటూ రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) చేసిన కామెంట్స్‌ను ఇండస్ట్రీలో ఎవరూ సమర్థించడం లేదు. ఆయన సరదాగానే అన్నా కూడా వార్నర్‌కు అసలు ఆయన ఏమన్నారో కూడా అర్థం కాక నవ్వుతూ కూర్చున్నాడు. దీంతో ఈ ఈవెంట్ పూర్తయినప్పటి నుండి ఇప్పటివరకు దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి. డేవిడ్ వార్నర్‌ను ఎక్కడినుండో పిలిపించి మరీ అవమానించినట్టుగా ఉందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ వయసులో పెద్ద అయ్యిండొచ్చు, ఆయన కంటే చిన్నవారిని ఏదైనా అనే స్వేచ్ఛ ఉండుండొచ్చు కానీ భాష రాని వ్యక్తిని అలా అనడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వల్ల ఇండస్ట్రీ పరువు పోయిందని ఫీలవుతున్నారు.