Deb Mukherjee’s funeral : బాలీవుడ్ ప్రముఖ నటుడు దేబ్ ముఖర్జీ (Deb Mukharjee) శుక్రవారం అనారోగ్యంతో కన్ను మూసిన సంగతి తెలిసిందే. 83 ఏళ్ల వయసులో ఆయన వృద్ధాప్య సమస్యల కారణంగా మృతి చెందారు. నిన్ననే ఆయన అంత్యక్రియలను ముంబైలో నిర్వహించారు. అయితే దేబ్ ముఖర్జీ కన్నుమూసిన విషయం తెలిసిన చాలా మంది సెలబ్రెటీలు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం ఏకంగా ఆయన పాడె మోసి వార్తల్లో నిలిచారు.
దేబ్ ముఖర్జీ అంతిమ సంస్కారాల్లో రణబీర్
స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) దేబ్ ముఖర్జీ పాడెను భుజానికి ఎత్తుకొని కనిపించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖర్జీ కొడుకు, ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ (Ayan Mukharjee), రణబీర్ కపూర్ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలోనే దేబ్ ముఖర్జీ అంత్యక్రియలకు సంబంధించిన పనులను రణబీర్ దగ్గరుండి చూసుకున్నట్టు సమాచారం.
వెకేషన్ నుంచి తిరిగొచ్చిన రణబీర్ – అలియా
దేబ్ మరణ వార్త విన్న వెంటనే అలియా, రణబీర్ హుటాహుటిన ముంబైకి తిరిగి వచ్చారు. అలీబాగ్ వెకేషన్ కోసం వెళ్ళిన ఈ జంట శనివారం ఉదయమే దేబ్ ముఖర్జీ అంత్యక్రియలకు చేరుకున్నారు. అయాన్, రణబీర్ ఇద్దరూ మంచి సన్నిహితులు. ఈ నేపథ్యంలోనే రణబీర్ తన స్నేహితుడి తండ్రి అంత్యక్రియలను దగ్గరుండి జరిపించారు. వీరిద్దరూ కలిసి వేక్ అప్ సిడ్, యే జవానీ హై దీవానీ, బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్- శివ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో వర్క్ చేశారు. కొన్ని రోజుల క్రితం అలియా పుట్టిన రోజును జరుపుకోవడానికి జరిగిన మీడియా సమావేశంలో రణ్‌బీర్ ‘బ్రహ్మాస్త్ర: పార్ట్ 2’ వర్క్ మొదలైందని ప్రకటించాడు. అయాన్ ప్రస్తుతం ‘వార్ 2’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
అంతిమ నివాళులు అర్పించిన ప్రముఖులు
ఇదిలా ఉండగా, అనిల్ కపూర్, హృతిక్ రోషన్, కాజోల్, జయ బచ్చన్ తో సహా అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు అయాన్ నివాసానికి అంతిమ నివాళులు అర్పించడానికి వచ్చారు. శుక్రవారం ఉదయం 83 ఏళ్ల వయసులో దేబ్ ఏజ్ సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా మరణించారని ఆయన ప్రతినిధి జూమ్‌కు కన్ఫామ్ చేశారు. దేబ్ ముఖర్జీ ప్రముఖ నటుడు, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తండ్రి, మరో ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్ మామ. అలాగే సీనియర్ హీరోయిన్ కాజోల్ కు ఆయన పెదనాన్న వరుస అవుతారు.
కాగా రణ్‌బీర్ చివరిసారిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఈ హీరో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘లవ్ అండ్ వార్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. యానిమల్ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’, నితేష్ తివారీ ‘రామాయణం’ సినిమాలను కూడా చేస్తున్నారు. ఇక దేబ్ ముఖర్జీ మృతి కారణంగా బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకోగా, ‘వార్ 2’ షూటింగ్ కు బ్రేక్ పడింది.