Pawan on Allu Arjun Case : సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ (Allu Arjun) ఇరుక్కోగా, కొంతవరకు ఆయనకు సినిమా ఇండస్ట్రీ నుంచి గట్టిగానే సపోర్ట్ లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అల్లు అర్జున్ ను కావాలనే టార్గెట్ చేశారనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఆ తర్వాత అసెంబ్లీలో ఆయన ఏం జరిగిందో వివరించిన తర్వాత సినీ వర్గాలు సైలెంట్ అయిపోయాయి. రీసెంట్ గా ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు (Dil Raju) నేతృతంలోని బృందం వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత వివాదం చల్లబడింది. కానీ ఇప్పటిదాకా ఈ వివాదంపై మెగా హీరోలు పెదవి విప్పలేదు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రియాక్షన్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. తాజాగా ఈ విషయంపై ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది.
అల్లు అర్జున్ (Allu Arjun) వివాదం గురించి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ “రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు. కింది స్థాయి నుంచి ఎదిగారు. వైసిపి తరహాలో సీఎం రేవంత్ వ్యవహరించలేదు. తెలంగాణలో టికెట్ ధరల పెంపుకు, బెనిఫిట్ షోలకు ఆయన చాన్స్ ఇచ్చారు. అల్లు అర్జున్ విషయంలో ముందు వెనక ఏం జరిగింది? అనేది నాకు అసలు తెలియదు. అయితే అభిమానులకు అభివాదం చేయాలనేది ప్రతి హీరోకు ఉంటుంది. ఈ ఘటనలో హీరోను ఒంటరిని చేశారు. పోలీసులు తీరును కూడా ఈ కేసులో తప్పు పట్టను” అని అన్నారు.
మొత్తానికి కర్రా విరగదు పామూ చావదు అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రియాక్షన్. అయితే మధ్యలో వైసిపి తరహా అనే మాట ఎందుకు వచ్చింది అంటే? గతంలో ఆంధ్రప్రదేశ్ లో వైసిపి హయాంలో టికెట్ రేట్లను తగ్గించడంపై ఫైర్ అయ్యారు. ‘మా పెట్టుబడులు పెట్టుకొని, మేం సినిమాలు చేస్తుంటే, మధ్యలో మీ పెత్తనం ఏంటి సినిమాపై?’ అంటూ ఒంటి కాలిపై లేచారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల వివాదం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అందరికంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఈ వివాదంపై ఫైర్ అయ్యారు.
అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నప్పటికీ పవన్ స్పందించకపోవడం ఏంటి అనే విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎట్టకేలకు స్పందించారు. ఇటు అల్లు అర్జున్ కు సపోర్ట్ చేసినట్టు చేస్తూనే, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం పై కూడా నెగిటివ్ గా మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు.
ఇక పవన్ కళ్యాణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. తాజాగా ఈ మూవీ నిర్మాత దిల్ రాజు స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్ ను అతిథిగా ఆహ్వానించారు. మొత్తానికి మరోసారి అబ్బాయ్ – బాబాయ్ ఓకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు.