Thug Life Kamal Haasan| కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ చిత్రం కర్ణాటకలో విడుదల కావడం లేదు. సినీ నిపుణుల ప్రకారం, ఈ నిర్ణయం వల్ల నిర్మాతలకు సుమారు రూ.12 కోట్ల నష్టం వాటిల్లవచ్చు. అయితే, ఈ వివాదం వల్ల సినిమాకు వచ్చిన ప్రచారం ముందు ఈ నష్టం తక్కువేనని వారు అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా పెద్ద బడ్జెట్ సినిమాల ప్రమోషన్ కోసం నిర్మాతలు రూ.30-50 కోట్లు ఖర్చు చేస్తారు. కానీ లాభాల హామీ ఉండదు. వివాదానికి ముందు ‘థగ్ లైఫ్’కు పెద్దగా గుర్తింపు లేదు. కానీ వివాదం తర్వాత, ఈ సినిమా నిరంతరం వార్తల్లో నిలిచింది. ఈ సినిమా కన్నడ విడుదల కేసు ఇంకా కోర్టులో విచారణ ఎదుర్కొంటోంది. కానీ కర్ణాటక మినహా.. దేశవ్యాప్తంగా జూన్ 5న విడుదల అయింది.
సినీ విశ్లేషకుడు గిరీష్ వాంఖడే మాట్లాడుతూ.. “కర్ణాటకలో విడుదల కాకపోవడం వల్ల నిర్మాతలకు రూ.7-8 కోట్ల నష్టం రావచ్చు. కానీ ఈ మొత్తాన్ని మార్కెటింగ్ ఖర్చుగా భావిస్తే, సినిమాకు వచ్చిన గుర్తింపు, హైప్ వల్ల ఈ నష్టం లాభంగా మారవచ్చు. ఇప్పుడు ప్రపంచమంతా ‘థగ్ లైఫ్’ అంటే కమల్ హాసన్ నటించిన, మణిరత్నం దర్శకత్వం వహించిన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన చిత్రమని అందరికీ తెలుసు,” అన్నారు.
సినీ డిస్ట్రిబ్యూటర్ రాజ్ బన్సాల్ అభిప్రాయం ప్రకారం.. “హిందీలోనే అడ్వాన్స్ బుకింగ్ రూ.65 లక్షలు ఉన్నాయి. అన్ని భాషల్లో కలిపి రూ.10 కోట్లు దాటింది. విడుదలకు ముందు ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.”
కమల్ హాసన్ గత చిత్రం ‘ఇండియన్ 2’ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. కానీ అంతకుముందు వచ్చిన ‘విక్రమ్’ భారత్‌లో రూ.247.32 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.414.43 కోట్లు కలెక్షన్లు సంపాదించి ఘనవిజయం సాధించింది.
థగ్ లైఫ్ సోషల్ మీడియా రివ్యూ
జూన్ 5న విడుదలైన ‘థగ్ లైఫ్’ మొదటి షో చూసిన అభిమానులు సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందించారు. మణిరత్నం దర్శకత్వంలో.. రాజ్ కమల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తగా నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతానికి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో కమల్ హాసన్, శిలంబరసన్ నటనకు అభిమానులు మెచ్చుకున్నప్పటికీ.. కొందరు కథ సాధారణంగా ఉందని.. ‘మీర్జాపూర్’, ‘పాతాళ్ లోక్’ సిరీస్‌లను పోలి ఉందని నిరాశ వ్యక్తం చేశారు.
ఒక సోషల్ మీడియా యూజర్ అయితే.. “సినిమా మొదటి భాగం మీర్జాపూర్, పాతాళ్ లోక్‌లా అనిపించింది. కమల్, STR కెమిస్ట్రీ మాత్రమే సినిమాను కొంత నిలబెట్టింది,” అని పేర్కొన్నారు. మరొకరు, “ఫస్ట్ హాఫ్ మణిరత్నం సినిమాలా, రెండో సగం సిరుతై కుట్టి సినిమాలా అనిపించింది,” అన్నారు. మరొక యూజర్ అయితే.. “సాధారణ సినిమా. ఒక్కసారి చూడవచ్చు. కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా, గ్రిప్ లేకుండా ఉన్నాయి,” అని కామెంట్ చేశాడు. అయితే సినిమాలకు వివాదాలతో ప్రొమోషన్ చేయడం, బజ్ క్రియేట్ చేయడం సాధారణంగా రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇండియన్ 2 తరువాత కమల్ కూడా ఆర్‌జివి బాట పట్టాడా? అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
ఈ చిత్రంలో శిలంబరసన్, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, అలీ ఫజల్, రోహిత్ సరాఫ్, బాబురాజ్ లాంటి భారీ తారాగణం ఉంది. 1987లో ‘నాయకన్’ సినిమా తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కలిసి పనిచేసిన చిత్రమిదే కావడం విశేషం.