Director Bobby : యంగ్ డైరెక్టర్ బాబీ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్లలో బిజీబిజీగా గడిపేస్తున్నారు చిత్రబంధం. అలాగే బాబి (Bobby) వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ, సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ బడా నిర్మాణ సంస్థపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబి డియోల్ విలన్ పాత్ర పోషిస్తుండగా, శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతెల, చాందిని చౌదరి కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ దొరికింది. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ బాబి ఓ బడా నిర్మాణ సంస్థపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
“సినిమా పేరు చెప్పను. కానీ బడ్జెట్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాను. ఆ సినిమా హిట్ అయింది. కానీ నేను అడిగినంత బడ్జెట్ పెట్టి ఉంటే, హిట్ స్థాయి వేరే లెవెల్ లో ఉండేది” అంటూ సదరు మూవీ నిర్మాణ సంస్థపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు బాబీ (Bobby). అయితే బాబీ సినిమా పేరును ప్రస్తావించకపోవడంతో సోషల్ మీడియాలో దీని గురించి చర్చ మొదలైంది. కొంతమంది ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అని అంటుంటే, మరి కొంతమంది అనుమానమే లేదు. ఆయన జై లవకుశ సినిమాను నిర్మించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ గురించి మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇక బాబీ ఎవరి గురించి చెప్పారు అనే విషయాన్ని పక్కన పెడితే, గత ఏడాది సంక్రాంతికి చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో థియేటర్లలో పూనకాలు తెప్పించారు. ఇక ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కి ‘డాకు మహారాజ్’తో ఐ ఫీస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా ‘డాకు మహారాజ్’ కోసం వరుస ఈవెంట్లను ప్లాన్ చేశారు మేకర్స్. జనవరి 2న ‘డాకు మహారాజ్’ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు రీసెంట్ గా నిర్మాత నాగ వంశీ వెల్లడించారు. జనవరి 4న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ఓ సాంగ్ ను లాంచ్ చేయబోతున్నారు. జనవరి 8న ఆంధ్రాలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున జరగబోతోంది. ఈవెంట్ ను విజయవాడలో చేస్తారా? లేదంటే మంగళగిరిలోనా? అన్న విషయాన్ని త్వరలోనే మేకర్స్ వెల్లడించబోతున్నారు.