Delhi notification Fraud| దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీల (ఆప్) మధ్య రాజకీయాలు వేడెక్కాయి. ఢిల్లీ అధికారంలో ఉన్న ఆప్ పార్టీ.. ప్రభుత్వాధికారుల చేత బిజేపీ తప్పుడు నోటిఫికేషన్ ఇప్పించిందని ఆరోపణలు చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించిన ఒక సంక్షేమ పథకం కోసం పార్టీ కార్యకర్తలు ప్రజల నుంచి సమచారం సేకరించనుండగా.. ఆ కార్యకర్తలు మోసగాళ్లని ప్రభుత్వాధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మండిపడ్డారు. నోటిఫికేషన్ జారీ చేసిన ఆధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఢిల్లీ ప్రభుత్వాధికారులపై బిజేపీ ఒత్తిడి చేసి ఈ నోటిఫికేషన్ విడుదల చేయించిందని.. అయినా ప్రజలు బిజేపీ అబద్ధాలను నమ్మే అవకాశం లేదని ఎంపీ సంజయ్ సింగ్ మీడియాకు తెలిపారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన్ పేరుతో కొత్త సంక్షేమ పథకం ప్రకటించారు. ఈ సంక్షేమ పథకం ప్రకారం.. ఢిల్లీలో నిరుద్యోగలుగా ఉన్న మహిళలకు ప్రభుత్వం ప్రతినెలా రూ.2100 వారి ఖాతాల్లో జమచేస్తుంది. అయితే ఈ పథకం అమలు కోసం రెండు రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఢిల్లీలో గడపగడపకు వెళ్లి సమాచారం సేకరించడం మొదలు పెట్టారు.
Also Read: మీ ఆధార్ కార్డు వివరాలు ఎవరైనా దొంగలిస్తున్నారేమో ఇలా చెక్ చేసుకోండి.. ఎలా కాపాడుకోవాలంటే
అయితే మరుసటి రోజే ఢిల్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంక్షేమ పథకం అంతా ప్రాడ్ అని.. సమాచారం సేకరించే వారంతా మోసగాళ్లని ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఆ వెంటనే ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీ అయిన బిజేపీ ప్రభుత్వంపై దాడికి దిగింది. నోటిఫికేషన్ జారీ చేయడం వెనుక స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఉన్నారని.. ఆమె మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు వ్యతిరేకమని ఆరోపణలు చేసింది. కేజ్రీవాల్ ఒక డిజిటల్ ఫ్రాడ్ అని బిజేపీ నాయకులు మరో అడుగు ముందుకేసి అనేశారు.
“అరవింద్ కేజ్రీవాల్ ఒక ఫ్రాడ్.. ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వమే ఉంది. వారి ప్రభుత్వ శాఖ నుంచే ఒక నోటీస్ జారీ అయింది. కేజ్రీవీల్ ప్రకటించిన పథకం అంతా మోసమని ఆ నోటీసులో ఉంది. ఢిల్లీలో ఆతిషి వర్సెస్ అరవింద్ కేజ్రీవాల్ గా రాజకీయం సాగుతోంది. ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ మోసం చేస్తున్నాడు.” అని ఢిల్లీ బిజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక ఫ్రాడ్ అని బిజేపీ ఎంపీ మనోజ్ తివారీ కూడా అన్నారు.
మరోవైపు ఇదంతా బిజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీయడానికే చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. తమ సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉండడం బిజేపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆతిషిపై కూడా తప్పుడు కేసులు పెట్టేందుకు కేంద్ర విచారణ ఏజెన్సీలు సిద్ధమవుతున్నట్లు తమకు సమాచారం అందిందని ఆరోపించారు.