Shankar : ఎప్పుడో 15 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ‘రోబో’ (Robo). ఈ మూవీకి సంబంధించిన వివాదం (Enthiran plagiarism case) తాజాగా డైరెక్టర్ శంకర్ (Director Shankar) మెడకు చుట్టుకుంది. ఈ మూవీ కాపీ కేసులో తాజాగా ఈడీ శంకర్ కు చెందిన మూడు 10 కోట్ల 11 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ విషయంపై తాజాగా శంకర్ స్పందిస్తూ ఈడీపై షాకింగ్ ఆరోపణలు చేశారు.
మౌనాన్ని వీడిన డైరెక్టర్ శంకర్
తన పేరు మీద ఉన్న మూడు స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేయాలనే నిర్ణయంపై డైరెక్టర్ శంకర్ మౌనాన్ని వీడారు. కాపీరైట్ ఉల్లంఘన జరగలేదని పేర్కొన్న ఆయన, ఈ విషయంలో కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ ఈడీ తీసుకున్న ఈ చర్య తనను తీవ్రంగా నిరాశపరిచిందని అన్నారు. ఈ మేరకు శంకర్ మాట్లాడుతూ “రోబో సినిమాకు సంబంధించిన నిరాధారమైన కాపీరైట్ ఆరోపణల ఆధారంగా చెన్నై జోనల్ ఆఫీస్ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రీసెంట్ గా నా మూడు స్థిరాస్తులను జప్తు చేస్తూ తీసుకున్న చర్య గురించి ప్రజల దృష్టికి తీసుకురావాలి అని అనుకుంటున్నాను. కాపీరైట్ ఆరోపణలకు సంబంధించిన విషయాన్ని హైకోర్టు ఇప్పటికే సివిల్ సూట్ నెంబర్ 914/2010లో పూర్తిగా తీర్పు ఇచ్చింది. రెండు వైపుల నుంచి వచ్చిన ఆధారాలు, వాదనలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రోబో కథ నిజమైన కాపీరైట్ హోల్డర్ గా తనను ప్రకటించాలని కోరుతూ ఆరూర్ తమిళనాథన్ దాఖలు చేసిన దావాను కోర్టు తోసి పుచ్చింది” అని అన్నారు.
“కోర్టు ఇలా స్పష్టంగా తీర్పు ఇచ్చినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన రిపోర్ట్ ను పరిగణలోని తీసుకుని, కేసు నెంబర్ 914/200 2010లో హైకోర్టు ఇచ్చిన బైండింగ్ తీర్పును పక్కన పెట్టి, నా ఆస్తులను అటాచ్ చేసింది. ఈడీ కంప్లైంట్ సూచించిన ప్రైవేట్ కంప్లయింట్ ను చెన్నై హైకోర్టు ఇప్పటికే Crl.MP.No.13914/23 లో Crl.Op.No.20452/23 లో జారీ చేసిన ఉత్తర్వులో నిలిపివేసింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కాపీరైట్ ఉల్లంఘన జరగలేదని సివిల్ కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ, ఈడీ ఇలా చేయడం నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇది కచ్చితంగా చట్టాన్ని దుర్వినియోగం చేయడమే. అధికారులు తాము తీసుకున్న చర్యలను సమీక్షించుకొని, ఈ విషయంలో తదుపరి చర్యలను ఆపేస్తారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ అలా చేయకపోతే అటాచ్మెంట్ ఆర్డర్ పై అప్పీల్ చేయడం తప్ప నాకు వేరే మార్గం లేదు” అని అన్నారు శంకర్.
వివాదం ఏంటంటే?
ఆరూర్ తమిళనాథన్ అనే రచయిత 2011లో తన కథ ‘జిగుబా’ని కాపీ కొట్టి ‘రోబో’ పేరుతో తీసారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశాడు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ కేసుపై విచారణ చేపట్టిన ఈడీ ఈ మూవీకి రచయితగా, దర్శకుడుగా వ్యవహరించిన శంకర్క కు రూ. 11 కోట్ల 50 లక్షల పారితోషకం అందినట్టు గుర్తించింది. అలా ఇన్వెస్టిగేషన్లో బయటపడిన ఆధారాలతో శంకర్ కు చెందిన 10 కోట్ల 11 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. శంకర్ కాపీ రైట్ యాక్ట్ 1957 ని ఉల్లంఘించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేపట్టిన విచారణలో ‘రోబో’, ‘జిగూబ’ మధ్య పోలికలు ఉన్నాయని నిర్ధారించింది.