Trump Tariffs on Film Industry: ట్రంప్ పోటు ఇండియన్ సినిమాలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపబోతుంది? ముఖ్యంగా అమెరికాలో దుమ్ము దులిపే తెలుగు సినిమాల పరిస్థితి ఏంటి? ఇకపై రికార్డ్ స్థాయి వసూళ్లు అనే మాటే చరిత్రేనా? ట్రంప్ దెబ్బకు డిస్ట్రిబ్యూటర్లు కుదేలవ్వడం ఖాయమేనా?
ఇండియన్ సినిమాలపై పడనున్న ట్రంప్ టారిఫ్ పోటు
ముఖ్యంగా టాలీవుడ్‌కు పెద్ద దెబ్బే అంటూ విశ్లేషణలు
సినిమాల కలెక్షన్లు, లాభాలపై గట్టి ఎఫెక్ట్
అప్ కమింగ్ సినిమాల పరిస్థితేంటి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్‌పై పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అమెరికా తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్. ఈ టారిఫ్‌లతో టికెట్ ధరలు రెట్టింపు కావచ్చు, దీనివల్ల ప్రేక్షకుల సంఖ్య తగ్గి, వసూళ్లు గణనీయంగా పడిపోవచ్చు. అంతేకాదు నిర్మాతలు భారీ నష్టాలను చూసే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు, మీడియం రేంజ్ చిత్రాలకు అమెరికా మార్కెట్ కీలకం. ఉదాహరణకు నాని హిట్-3 నాలుగు రోజుల్లో 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. కానీ ఇలాంటి వసూళ్లు ఇకపై సాధ్యం కాకపోవచ్చు.
డిస్ట్రిబ్యూటర్లలో ఇప్పటికే మొదలైన టెన్షన్
ముఖ్యంగా సినిమా డిస్ట్రిబ్యూటర్లలో ఇప్పటికే టెన్షన్ మొదలైంది. మరికొద్ది రోజుల్లో రిలీజ్ అయ్యే సినిమాలు కొనుగోలు చేసే వారికి షాక్ తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కనుక ట్రంప్ టారిఫ్ విధిస్తే లాభాల మాట అటుంచి ఆర్థిక నష్టాలు తప్పవనే చర్చ జరుగుతోంది.
దుమ్మురేపిన పఠాన్, RRR, డుంకీ, జవాన్
కొన్నేళ్లుగా ఇండియన్ మూవీస్‌కు అమెరికాలో మంచి మార్కెట్ ఏర్పడింది. పఠాన్, RRR, డుంకీ, జవాన్ వంటీ ఇండియన్ మూవీస్ అమెరికాలో కలెక్షన్ల రికార్డులు సృష్టించాయి. ఎస్పెషల్‌గా నార్త్ అమెరికాలో ఇండియన్ మూవీస్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. దీనికి తోడు ఇండియాలో కంటే ఒకరోజు ముందే ఓవర్సీస్‌లో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇది కూడా కలెక్షన్లు అమాంతం పెరిగేందుకు ఓ కారణమవుతోంది.
అదనంగా మరో మిలియన్ డారల్లు టారిఫ్
ట్రంప్ టారిఫ్ పెంచితే ఒక మిలియన్ డాలర్లకు సినిమాను కొనుగోలు చేస్తే.. అమెరికా డిస్ట్రిబ్యూటర్ అదనంగా మరో మిలియన్ డాలర్లు టారిఫ్ చెల్లించాలి. అంటే పెట్టుబడి డబుల్ అవుతుంది. ఈ సమయంలో సినిమా ఏదైనా అటు ఇటు అయితే అతని పరిస్థితి అంతే.
రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు చేసిన హిట్-3
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికే రిలీజ్ అయిన హిట్- 3 మూవీని తీసుకుంటే.. ఈ మూవీ అమెరికాలో 2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే డిస్ట్రిబ్యూటర్‌కు 9 లక్షల డాలర్లు వస్తాయి. అదే 100 శాతం టారిఫ్‌లు అమల్లోకి వస్తే ఇది 4 లక్షల 50 వేల డాలర్లకు తగ్గిపోతుంది.
టికెట్ ధర 30 నుంచి 35 డాలర్లకి పెరిగే అవకాశం
అంతేకాదు ప్రస్తుతం థియేటర్లలో టికెట్ ధర 15 నుంచి 17 డాలర్లు ఉంటుంది. టారిఫ్ కారణంగా అదే టికెట్ ధర 30 నుంచి 35 డాలర్లకి పెరిగే అవకాశం ఉంది. ఇలా ధరలు పెరిగితే సినిమాలు చూసే విషయంలో ప్రేక్షకులు కాస్త ఆలోచిస్తారు. దీంతో నిర్మాతలు తమ సినిమాల అమెరికా డిస్ట్రిబ్యూషన్ రేట్లను 50 శాతం వరకు తగ్గించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే విడుదల కాని సినిమాల హక్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, ఒప్పందాలను తిరిగి చర్చించి సగం ధరకు తగ్గించుకోవాల్సి ఉంటుంది.
హరిహర వీరమల్లు, కుభేర, కింగ్ డమ్
ఇప్పటికే హరిహర వీరమల్లు, కుభేర, కింగ్ డమ్, థగ్ లైఫ్స్, తమ్ముడు, విశ్వంభర, రాజాసాబ్, కూలీ, ఆఖండ లాంటి సినిమాల ఓవర్సీస్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ముందుగానే కాస్త డబ్బు చెల్లించి తమ హక్కులను రిజర్వ చేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ట్రంప్ టారిఫ్‌లు కనుక అమల్లోకి వస్తే ఇప్పుడు వీరందరిపై ఎఫెక్ట్ పడటం ఖాయం.
టారిఫ్‌లు కనుక అమల్లోకి వస్తే వీరందరిపై ఎఫెక్ట్
2023లో ఇండియన్ మూవీస్ అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద 20 మిలియన్ డాలర్లకు పైగ కలెక్షన్స్ రాబట్టాయి. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 168 కోట్లు. కొన్ని సినిమాలు అయితే 1000కు పైగా స్క్రీన్లలో ప్రదర్శించారు. కల్కీ మూవీ 63 కోట్లు పెట్టి కొంటే.. 250 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది.. పుష్ప-2 108 కోట్లకు కొనుగోలు చేస్తే.. 250 కోట్లకు పైగా వసూలు చేసింది.. ఇది తెలుగు సినిమాలకు సంబంధించి అమెరికా వాటా. విదేశాల్లో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాల విషయానికి వస్తే 85 శాతం అమెరికాలోనే రిలీజ్ అవుతాయి. మిగిలిన 15 శాతం మాత్రమే ఇతర దేశాల్లో రిలీజ్ అవుతాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ చెప్పినట్టుగా నిజంగానే టారిఫ్‌లు అమలు చేస్తే ఆ ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది.
రెమ్యునరేషన్ లో భాగంగా ఓవర్శీస్ రైట్స్
ఇప్పటి వరకు కొందరు హీరోలు తమ రెమ్యునరేషన్‌లో భాగంగా ఓవర్సీస్ రైట్స్‌ను తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు ఎలాంటి టారిఫ్‌లు లేవు కాబట్టి.. ఈ రైట్స్ తీసుకొని లాభాలను తీసుకుంటున్నారు. కానీ ఇకపై అలా చేసే అవకాశం ఉండకపోవచ్చు. దీని వల్ల రెమ్యునరేషన్ భారం నిర్మాతలపై పడే అవకాశం ఉంది.
హాలీవుడ్ మూవీస్ పై కూడా ఎఫెక్ట్
ముందు ముందు బ్లాక్ బాస్టర్ మూవీలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. సలార్ 2, స్పిరిట్, వార్-2తో పాటు అనేక బ్లాక్ బస్టర్ మూవీస్ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు వీటన్నింటిపై ఎఫెక్ట్ పడినట్టే. కేవలం ఇండియన్ సినిమాలు మాత్రమే కాదు.. హాలీవుడ్ మూవీస్‌పై కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌ను తీసుకుంటే.. రష్యా నుంచి మొదలుపెడితే అఫ్ఘానిస్థాన్ వరకు ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. మరి ఈ మూవీని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చూస్తుంది? షూటింగ్ విదేశాల్లో జరిగింది కాబట్టి దానిపై కూడా టారిఫ్‌లు విధిస్తారా?
వివధ దేశాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం
అసలు ట్రంప్ తాను తీసుకున్న నిర్ణయంపై ఎంత వరకు నిలబడతారన్నది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. ట్రంప్ గతంలో కూడా టారిఫ్‌లకు సంబంధించి అనేక బెదిరింపులు చేశారు. కానీ భౌగోళిక రాజకీయాలు, తాను తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగే నష్టం.. ఇలా అనేక కారణాల వల్ల వెనక్కి తగ్గారు.
చైనాలో హాలీవుడ్ సినిమాలపై అప్రకటిత ఆంక్షలు
మరోవైపు ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే వివిధ దేశాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా చైనా నుంచి. ఇప్పటికే డ్రాగన్ కంట్రీ హాలీవుడ్ సినిమాలపై అప్రకటిత ఆంక్షలు అమలు చేస్తోంది. ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అమెరికన్ సినిమాలకు షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉంది.
కైంటర్‌గా హాలీవుడ్ సినిమాలపై టారిఫ్‌లు విధిస్తే
హాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో చూస్తారు. స్ట్రెయిట్‌గా కూడా వందలాది సినిమాలు రిలీజ్ అవుతాయి. ట్రంప్ తీసుకునే నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్లు కూడా కౌంటర్‌గా హాలీవుడ్ సినిమాలపై టారిఫ్‌లు విధిస్తే ఎలా ఉంటుంది? ఇప్పటికే ఈ ఆలోచనపై అనేక దేశాల్లో చర్చ మొదలైంది. అందుకే ట్రంప్ వెనక్కి తగ్గుతారా? లేదా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అంతేకాదు హాలీవుడ్‌ను తన కంట్రోల్‌లో ఉంచుకోవాలనే ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నారా? అనే చర్చ కూడా ఉంది.