Fahadh Faasil: తెరపై ఫహద్ ఫాజిల్ ఉంటే… ఉత్కంఠకు కొదువుండదు.. మలయాళంలో సంచలనం సృష్టించిన మిస్టరీ థ్రిల్లర్ ‘ఇరుల్’, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను భయంతో ముంచెత్తడానికి సిద్ధమవుతోంది. ‘అపరాధి’ పేరుతో, నేరుగా మీ ఆహా ఓటీటీలోకి మే 8న రాబోతున్నాడు ఈ రహస్యాల రాజు..
‘అపరాధి’ఇలా ..రానుంది
సినిమా విషయానికి వస్తే.. నిశ్శబ్దమైన రాత్రి… కుండపోతగా కురుస్తున్న వర్షం… ప్రేమతో నిండిన హృదయాలు, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఒక ప్రయాణం మొదలుపెడతాయి. అలెక్స్, తన ప్రియమైన అర్చనకు తన ప్రేమను వ్యక్తం చేయాలని ఒక ప్రత్యేకమైన వీకెండ్ ట్రిప్‌ను ప్లాన్ చేస్తాడు. ప్రకృతి ఒడిలో, ప్రేమికుల గుసగుసల మధ్య వారి బండి ఆగిపోతుంది. దిక్కుతోచని స్థితిలో వారికి ఒక ఒంటరి బంగ్లా తలుపులు తెరుస్తుంది. ఆ ఇంట్లో వారికి ఎదురవుతాడు ఉన్ని.. ఒక రహస్యాల గని. అతని చూపుల్లో ఏదో తెలియని భయం, మాటల్లో దాగి ఉన్న చీకటి అలెక్స్‌ను, అర్చనను కలవరపరుస్తాయి. ఇంతలో, ఆ ఇంట్లో అలెక్స్‌కు ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది – ఒక మహిళ మృతదేహం! అతని నవల “ఇరుల్”లో తాను ఊహించిన సీరియల్ కిల్లర్ చేసిన హత్యను తలపిస్తుంది ఆ దృశ్యం. అనుమానం ఉన్ని వైపు తిరుగుతుంది, అలెక్స్ అతన్ని బంధిస్తాడు.
ఊహించని మలుపు..
కానీ కథ ఇక్కడే ఊహించని మలుపు తిరుగుతుంది. బంధీ అయిన ఉన్ని నోటి నుండి అలెక్స్ గురించిన భయంకరమైన రహస్యాలు ఒక్కొక్కటిగా అర్చనకు తెలుస్తాయి. ఆ ఇల్లు అలెక్స్‌దేనని, ఆ హత్య చేసింది ఉన్ని కాదని, స్వయంగా అలెక్సేనని ఉన్ని వాదిస్తాడు. అబద్ధాల పొరలు వీడుతుండగా, నిజం ఒక భయానకమైన నీడలా వారిని వెంటాడుతుంది. ప్రేమ మధ్య చిచ్చు రేగుతుందా..? నమ్మకం బూడిదవుతుందా..? అర్చన ఎవరిని నమ్ముతుంది? తన ప్రియుడినా? లేక తనను బంధించిన ఆ అపరిచితుడినా? అలెక్స్, ఉన్నిలలో అసలు హంతకుడు ఎవరు..? అర్చన తెలుసుకున్న నిజాలు ఆమె జీవితాన్ని ఏ మలుపు తిప్పుతాయి? ఉన్ని అర్చనకు ఎలాంటి ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు..?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే, మీరు తప్పకుండా చూడాల్సిందే ఫహద్ ఫాజిల్ నటించిన ఈ ఉత్కంఠభరితమైన చిత్రం “అపరాధి”, ఆహా ఓటీటీలో త్వరలో మీ ముందుకు రాబోతోంది.. కేవలం 91 నిమిషాల్లో ముగిసే ఈ ప్రయోగాత్మక చిత్రం, ముగ్గురు పాత్రలతో ఒకే ఇంట్లో సాగే ఈ కథ మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫహద్ ఫాజిల్ నెగటివ్ షేడ్స్‌లో తన అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేస్తాడు.