Fun Bucket Bhargav : మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్ (Fun Bucket Bhargav) కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు భార్గవ్ ను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
ఫన్ బకెట్ భార్గవ్.. నిన్న మెున్నటి వరకూ యూట్యూబర్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ నేడు ఓ తప్పుతో కటకటాలపాలయ్యాడు. తనతో పాటు నటించిన మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని కేసు నమోదు కాగా పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టిన అనంతరం బాలికపై లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారించారు. ఇక ఈ కేసులో 25 మంది సాక్షులను విచారించారు పోలీసులు. వీరిలో 17 మంది కోర్టులో సాక్ష్యం చెప్పారు. దీంతో అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. పోక్సో చట్టం కింద భార్గవ్ కు ఈ శిక్ష పడినట్టు తెలుస్తోంది.
మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో ఈ శిక్ష పడడంతో భార్గవ్ అప్పీల్ కి వెళ్లినా పై కోర్టు స్వీకరించదని.. 5 ఏళ్ల పాటు ఎలాంటి ఉపసంహరణ ఉండదని కోర్టు స్పెషల్ పీపీ మూర్తి తెలిపారు. ఇక కోర్టు తీర్పు వెలువడటంతో ఈ రోజు మధ్యాహ్నం భార్గవ్ కు వైద్య పరిక్షలు నిర్వహించారు. అనంతరం విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
భార్గవ్ కేసులో విశాఖపట్నం ప్రత్యేక పోక్స్ కోర్టు (pocso court visakhapatnam) విచారణ చేపట్టింది. 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసినట్టు వచ్చిన ఆరోపణలు నిజమేనని తేల్చి చెప్పింది. ఈ కేసులో భార్గవ్ కు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. తనతో పాటు టిక్ టాక్ వీడియోలు చేస్తున్న ఆ బాలికను బెదిరించి పదేపదే లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఈ అమానుష చర్య కారణంగా బాలిక గర్భం దాల్చిందని.. బాధితురాలి ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.
ఇక ఈ కేసులో విశాఖ మహిళా పోలీస్ స్టేషన్ ఎసీపీ డాక్టర్ జి. కాజల్ పూర్తి స్థాయి దర్యాప్తును చేపట్టారు. చార్జ్ షీట్ తో పాటు సాక్ష్యాలను సైతం కోర్టులో సమర్పించారు. కేసుకు సంబంధించిన అన్ని సాక్షాలను పరిశీలించిన విశాఖపట్నం ప్రత్యేక పోక్సో కోర్టు భార్గవ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధిత బాలికకు రూ.4 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఇక ఈ మధ్యకాలంలో యూట్యూబర్లుగా మంచి పేరు సంపాదించుకున్న ఎందరో యువకులు లైంగిక వేధింపుల కేసుల్లో చిక్కుకొని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు యూట్యూబర్స్ ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుండగా.. ప్రముఖ యూట్యూబ్ హర్ష సాయి (Youtuber Harsha Sai) సైతం ఇలాంటి లైంగిక దాడి ఆరోపణలే ఎదుర్కున్నారు. అప్పట్లో ఈ కేసు సైతం తీవ్ర దుమారాన్ని రేపింది. ఇక తాజాగా ఫన్ బకెట్ భార్గవ్ (Fun Bucket Bhargav) 20 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కున్నారు.
ALSO READ : విశాల్ ఆరోగ్యంపై స్పందించిన హీరోయిన్.. ఏమన్నారంటే..?