గేమ్ ఛేంజర్.. భారీ బడ్జెట్ తో, అంతకు మించి అంచనాలతో ఈ ఏడాది విడుదలవబోతున్న మొదటి సినిమా ఇది. జనవరి 10న విడుదలకు సిద్ధంగా ఉన్న గేమ్ ఛేంజర్ (Game Changer)మూవీకి సంబంధించి రీసెంట్ గానే ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. వాస్తవానికి ట్రైలర్ రిలీజ్ కి ముందు గేమ్ ఛేంజర్ పై ఎక్కువగా హైప్ లేదు. కానీ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో ఆ తర్వాత గేమ్ ఛేంజర్ మూవీకి హైప్ బాగా పెరిగిపోయింది. దీంతో మెగా ఫ్యాన్స్ అందరూ టికెట్లను అడ్వాన్స్ గా బుకింగ్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గేమ్ ఛేంజర్ మూవీకి పెద్ద గుడ్ న్యూస్ చెప్పారు. గేమ్ ఛేంజర్ మూవీకి టికెట్ ధరలు భారీగా పెంచడంతో మెగా ఫ్యాన్స్ అందరూ సంబరపడిపోతున్నారు. కానీ సామాన్యుడిపై మాత్రం భారీ దెబ్బ పడబోతోందని చెప్పవచ్చు. మరి ఇంతకీ గేమ్ ఛేంజర్ మూవీకి ఏపీ గవర్నమెంట్ ఏ రేంజ్ లో ధరలు పెంచిందో ఇప్పుడు చూద్దాం.
టికెట్ ధరలు పెంచిన ఏపీ ప్రభుత్వం..
దిల్ రాజు(Dilraju) నిర్మాతగా, శంకర్(Shankar) దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ (Ram Charan), కియారా అద్వానీ (Kiara Advani), అంజలి(Anjali), శ్రీకాంత్(Srikanth), ఎస్.జే.సూర్య(S.J.Surya )వంటి స్టార్స్ నటించారు. ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉన్న టికెట్ ధరలపై మరింత హైక్ పెంచుతూ ధరలను ప్రకటించింది. అలాగే బెనిఫిట్ షోలకి కూడా అవకాశం ఇచ్చింది. ఇక ఏపీ గవర్నమెంట్ పెంచిన టికెట్ ధరలు ఇలా ఉన్నాయి.. గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న విడుదలవుతుంది. కాబట్టి ఒకరోజు ముందుగానే అంటే జనవరి 9న అర్ధరాత్రి 1:00 గంటలకి బెనిఫిట్ షో అవకాశం ఇచ్చింది. అలాగే ఈ బెనిఫిట్ షో కి రూ.600 మేరా టికెట్ రేట్ ని పెంచుకునే అవకాశం కల్పించింది. ఇక ప్రస్తుతం ఉన్న సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ ధరలతో ఈ టికెట్టు ధర యాడ్ చేస్తే సుమారుగా రూ.800 నుండి రూ.1000 వరకు ఉంటుంది.
సామాన్యుడి పై తప్పని మోత..
అయితే ఇది సామాన్యుడికి భారంగా మారనుంది అని, ఒక్కొక్క టికెట్ ధర ₹1000 అంటే కుటుంబంలో నలుగురు సినిమా చూడాలంటే రూ.4000, స్నాక్స్ అదనం. మొత్తం 5000 రూపాయలు ఉంటే తప్ప అభిమాన హీరో సినిమా చూడలేని పరిస్థితి ఏర్పడిందని సామాన్యులు కామెంట్లు చేస్తున్నారు.
బెనిఫిట్ షోలకి కూడా అవకాశం..
ఇదిలా ఉండగా జనవరి 10 అంటే ఆ రోజు మొత్తం ఏకంగా ఆరు షోలు వేసుకునేలా అవకాశం కూడా కల్పించింది. అంతేకాకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో జిఎస్టి తో కలిపి రూ.282.50 టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఇవ్వగా.. మల్టీప్లెక్స్ లో జిఎస్టి తో కలిపి రూ.352 రూపాయలు రేటు పెంచుకునేలా అవకాశం కల్పించింది. ఇక జనవరి 10 నుండి 23 వరకు ప్రతిరోజు 5 షోస్ వేసుకునేలా ఏపీ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ అందరూ ఖుషీలో ఉన్నారు. ఇక 15వ రోజు నుంచి ఫుల్ రన్ ముగిసే వరకు సింగిల్ స్క్రీన్ లో రూ. 147.5, మల్టీప్లెక్స్ లలో 177 రూపాయలు పెంచుకునేలా అవకాశం కల్పించింది.అంతేకాకుండా గేమ్ ఛేంజర్ మూవీ విడుదలైన డేట్ రోజు టికెట్ రేట్ ఎంత ఉందో జనవరి 23 వరకు కూడా పెంచిన టికెట్ ధరలతోనే కొనసాగించుకోవచ్చని తెలిపింది.