Gopichand 33: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. వారందరూ పట్టు వదలన్నీ విక్రమార్కుల్లా ఇండస్ట్రీపై యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా.. అది కాకపోతే మరొక సినిమా అంటూ ప్రేక్షకులు ముందుకు వస్తూనే ఉన్నారు. అలా ప్రేక్షకుల మీద యుద్ధం ప్రకటించిన హీరోల్లో గోపీచంద్ మొదటి వరుసలో ఉంటాడు. తొలివలపు అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. విలన్ గా విజయాలను అందుకొని, హీరోగా మంచి చిత్రాల్లో నటించి మెప్పించాడు గోపీచంద్. ఆయన ఎంచుకొనే కథలన్నీ ఎంతో అద్భుతంగా ఉంటాయి. చాలా కొత్తగా ఉన్నా కూడా ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరించలేకపోయారు.
ఎన్నో ఏళ్లుగా గోపీచంద్ ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మంచి మంచి కథలను ఎంచుకుంటున్న కూడా అతనికి ఒక మంచి విజయం మాత్రం దక్కడం లేదు. ప్రతి ఏడాది ఈ హీరో కనీసంలో కనీసం ఒక్క సినిమాతోనైనా ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. గతేడా రెండు సినిమాలతో గోపీచంద్ ప్రేక్షకులను ముందుకు వచ్చాడు.భీమా, విశ్వం ఈ రెండు సినిమాలు కూడా అతన్ని విజయం దిశగా తీసుకెళ్లలేకపోయాయి. అయినా సరే ఈ హీరోలో పట్టుదల తగ్గలేదు.
వర్షం, నిజం లాంటి సినిమాలలో విలన్ గా నటించి మెప్పించిన గోపీచంద్ ఇప్పుడు హీరోగా పరాజయాలను అందుకోవడంతో తట్టుకోలేని ఆయన అభిమానులు ఇప్పటికైనా హీరోగా మానేసి విలన్ గా చేస్తే గొప్ప పేరు వస్తుందని కామెంట్స్ చేస్తున్నా.. అవేమీ పట్టించుకోకుండా ఎలాగైనా హీరోగా నిలదొక్కుకోవడానికి గోపీచంద్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ హీరో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఘాజి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ ఒక సినిమా చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఇక నేడు గోపీచంద్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా సంకల్ప్ రెడ్డి తో సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గోపీచంద్ 33వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస నిర్మిస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక స్పెషల్ గ్లింప్స్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ ఒక వీరుడిగా కనిపిస్తున్నాడు. “అతడు యోధుడు.. విప్లవాన్ని రగిలించడానికి సిద్ధంగా ఉన్నాడు” అనే క్యాప్షన్ తో మేకర్స్ గోపీచంద్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. యోధుడి లుక్ లో గోపీచంద్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇప్పటివరకు ఈ హీరోను ఈ రేంజ్ లో చూసింది లేదు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారింది. గోపీచంద్ కెరీర్ లోనే మొదటిసారి భారీ బడ్జెట్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. మరి ఈ చిత్రంతో నైనా ఈ హీరో గట్టెకుతాడా లేక పరాజయాల పరంపరలో కొనసాగుతాడా అనేది చూడాలి.