Hari Hara Veera Mallu : ‘దసరా’కు పలువురు స్టార్ హీరోల సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చి అభిమానులను ఖుషి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీపావళి కానుకగా కూడా ఇలాగే స్టార్ హీరోల సినిమాల నుంచి అప్డేట్స్ రాబోతున్నాయని ఎదురు చూస్తున్నారు అభిమానులు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాకు సంబంధించి మేకర్స్ బాంబ్ పేల్చారు.. మెగా ఫ్యాన్స్ కు ఎదురు చూపులు తప్పవు అనే ప్రచారం జరుగుతోంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా గురించి. మరి ఈ సినిమా విషయంలో అసలేం జరుగుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే ‘హరి హర వీర మల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా సెట్స్‌కి తిరిగి వచ్చి ‘ఓజీ’ క్లైమాక్స్ చిత్రీకరణకు సిద్ధమవుతున్నారు. ‘హరి హర వీరమల్లు’ సినిమాలో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన మొదటి సింగిల్ త్వరలో విడుదల కానుందనే వార్తతో చాలా ఉత్కంఠత నెలకొంది. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న బజ్ ప్రకారం మెగా ఫ్యాన్స్ కు దీపావళికి నిరాశ తప్పేలా లేడు.
దురదృష్టవశాత్తూ ఈ టైమ్‌లైన్‌కు అనుగుణంగా మేకర్స్ ప్రయత్నాలు చేసినప్పటికీ, ఈ పాటను దీపావళికి రిలీజ్ చేసే ఛాన్స్ లేదని టాక్ నడుస్తోంది. దీనికో ప్రత్యేకమైన కారణమే ఉంది. ఈ ట్రాక్‌పై ఫైనల్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో సాంగ్ అసంపూర్తిగా ఉందని తెలుస్తోంది. అందుకే మేకర్స్ ‘హరి హర వీరమల్లు’ ఫస్ట్ సాంగ్ ను ఈ దీపావళికి రిలీజ్ చేసే ఛాన్సే లేదని అంటున్నారు. ఈ వార్త ఇప్పటిదాకా పండగకు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) నుంచి పవన్ పాడిన సాంగ్ రిలీజ్ కాబోతోంది అని ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులను నిరాశకు గురి చేస్తోంది.
జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించింది. ఈ ప్రాజెక్టుకు మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కానీ ఆ తరువాత పలు వివాదాల వల్ల మూవీ ఆగిపోయింది అనే వార్తలు విన్పించాయి. కానీ ఆ తరువాత వివాదాలను పక్కన పెట్టి క్రిష్ సారధ్యంలో జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ పాన్-ఇండియన్ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘హరి హర వీర మల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రం 2025 మార్చి 28న విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
ఈ నేపథ్యంలోనే మరోవైపు నందమూరి అభిమానుల పరిస్థితి కూడా దీపావళికి ఇలాగే ఉండబోతోంది. తాజాగా ‘ఎన్‌బీకే 109’ (NBK109) మూవీ నుంచి టైటిల్ అనౌన్స్ మెంట్ ఆలస్యం అవుతుందని క్లారిటీ ఇచ్చారు నాగవంశీ. బాబీ (Bobby) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. దీపావళికి ‘ఎన్‌బీకే 109’ టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉండబోతుందని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయమే.