Hari Hara Veera Mallu: ఈరోజుల్లో స్టార్ హీరోలు నటించిన సినిమాలు వరుసగా వాయిదాలు పడడం చాలా కామన్. అది ప్రేక్షకులకు కూడా అలవాటు అయిపోయింది. ఒక స్టార్ హీరో సినిమా ఫలానా రోజు విడుదల అవుతుందని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా అది ఆరోజు విడుదల అవ్వడం కష్టమే అని ఫ్యాన్స్ ముందుగానే ఫిక్స్ అయిపోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ విషయంలో కూడా అదే జరుగుతోంది. పవన్ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వకముందు, డిప్యూటీ సీఎం పదవి అందుకోక ముందు ఈ సినిమాను సైన్ చేశారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల ‘హరి హర వీరమల్లు’కు రిలీజ్ డేట్ కష్టాలు మొదలయ్యాయి.
రిలీజ్ ఎప్పుడు?
దాదాపు రెండేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు సైన్ చేశారు. అందులో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. ముందుగా క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభమయ్యింది. అలా కొన్నాళ్ల పాటు ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. చాలాకాలం ట్రైనింగ్ తర్వాత ఫైనల్‌గా షూటింగ్ మొదలయ్యింది. షూటింగ్ మొదలయిన కొన్నాళ్లకే ‘హరి హర వీరమల్లు’కు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ అంతా చాలా ఖుషీ అయ్యారు. కానీ ఆ తర్వాతే ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. అప్పటినుండి ‘హరి హర వీరమల్లు’ పరిస్థితి అయోమయంగా మారిపోయింది. రిలీజ్ డేట్ విషయంలో కూడా అదే జరుగుతోంది.
మళ్లీ కన్ఫ్యూజన్
కొన్నిరోజుల క్రితం రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. అందులో మందుగా ‘హరి హర వీరమల్లు’ను పూర్తి చేయాలని అనుకున్నారు. ఇక పవన్ సెట్‌లోకి అడుగుపెట్టేసరికి మిగిలిన షూటింగ్ కూడా పూర్తయిపోతుందని, విడుదలకు సిద్ధమవుతుందని ఫ్యాన్స్ భావించారు. అనుకున్నట్టుగానే మార్చి 28న విడుదల తేదీ అంటూ ప్రకటించారు మేకర్స్. నిర్మాత ఏఏమ్ రత్నం కూడా అదే తేదీకి సినిమా విడుదల అవుతుందని హామీ ఇచ్చారు. కానీ అనుకోకుండా షూటింగ్ మళ్లీ ఆగిపోయింది. దీంతో రిలీజ్ డేట్‌పై మళ్లీ కన్ఫ్యూజన్ మొదలయ్యింది. ఈ భారమంతా పవన్‌పైనే పడింది.
Also Read: ‘విశ్వంభర’ రిలీజ్ డేట్.. ఆరోజు ప్రత్యేకత ఏంటంటే.?
కాల్స్ షీట్స్‌పైనే భారం
మార్చి 28 నుండి ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) తప్పుకుందని ఏప్రిల్ 17 లేదా మే 9న ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాల్ షీట్స్‌పైనే ఈ మూవీ రిలీజ్ ఆధారపడి ఉందని తెలుస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ మరికొన్ని రోజుల పాటు ఈ సినిమాకు టైమ్ ఇస్తే కచ్చితంగా ఈసారి షూటింగ్ పూర్తి చేసి విడుదల ఫిక్స్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఏప్రిల్, మేలో కుదరకపోతే కనీసం ఆగస్ట్‌లో అయినా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ నుండి రెండు పాటలు విడుదలయ్యి సినిమాపై అంచనాలు పెంచేశాయి.