Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడికల్ చిత్రం హరిహర వీరమల్లు. ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్లు మారారు.. పార్టీలు మారాయి.. హీరోయిన్లు మారారు. చివరికి పవన్ కు పదవి కూడా వచ్చింది. అయినా వీరమల్లు రిలీజ్ కు మోక్షం దక్కలేదు. ఎన్నాళ్ళు వేచి చూడాలో అని డైరెక్టర్ క్రిష్.. ఘాటీ పేరు చెప్పి తప్పించుకున్నాడు.
నిర్మాత ఏఎం రత్నం మాత్రం తనకు తప్పదు అన్నట్లు.. పవన్ ఎప్పుడు వస్తాడో.. ఎప్పుడు. షూటింగ్ ను ఫినిష్ చేస్తాడో అని ఆలోచిస్తూనే కాలం గడిపేసి చివరకు పవన్ తో షూటింగ్ ను ఫినిష్ చేయించాడు. ఇక షూటింగ్ పూర్తయ్యిందని ఆనందపడేలోపు రిలీజ్ డేట్ వాయిదా పడుతూనే వస్తుంది. ఏ ఇదంతా అయ్యే యవ్వారంలా లేదు. వీరుమల్లు రిలీజ్ అవుతుందన్న నమ్మకం లేదు అనుకుంటున్న సమయంలో జూన్ 12 న మా సినిమా రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించడంతో నీరుగారిపోయిన అభిమానుల మనస్సులో కొద్దీకొద్దిగా ఆశలు చిగురించాయి.
ఇక డైరెక్టర్ క్రిష్ వెళ్లిపోవడంతో కొడుకు జ్యోతి కృష్ణనే డైరెక్టర్ గా మార్చి సినిమాను ఫినిష్ చేసిన రత్నంనే ప్రమోషన్స్ ను కూడా తన భుజ స్కంధాల మీద వేసుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 8, 2025న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్న తారక రామ స్టేడియంలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ తో పాటు అతిరథ మహారథులు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
జూన్ 7 నే పవన్ తిరుపతికి చేరుకోనున్నారని సమాచారం. ముందుగా స్వామివారి ఆశీస్సులు అందుకున్నాకే పవన్ ఈవెంట్ కు చేరుకోనున్నారట. ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ ఉంటుందని తెలుస్తోంది. సినిమా నుంచి కొత్త ట్రైలర్ లేదా ప్రోమో విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి విజయం అందుకుంటారో.. ఇన్నేళ్లు ఎదురుచూసిన నిర్మాతకు ఎలాంటి విజయాన్ని అందించబోతున్నారో చూడాలి.