Shalini Ajith Kumar: షాలినీ అజిత్ కుమార్ (Shalini Ajith Kumar).. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ఆరంభించిన ఈమె.. మూడు సంవత్సరాల వయసులోనే మలయాళం సినిమా ‘ఎంటె మమట్టిక్కుట్టియమ్మక్కు’ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా నవోదయ స్టూడియో నిర్మాణంలో విడుదలైంది. ఇక తెలుగు సినిమా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలో తన చెల్లెలు షామిలితో కలిసి చిరంజీవి (Chiranjeevi) చేరదీసే అనాధ అమ్మాయి పాత్రలో నటించింది షాలినీ. అలా పదుల సంఖ్యలో చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలు చేసిన ఈమె.. ఆ తర్వాత చాలా కాలం తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. ‘అనియతి ప్రవు’ అనే సినిమాతో హీరోయిన్గా అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత తెలుగు, మలయాళం, తమిళ్ చిత్రాలలో నటించి, మంచి పేరు సొంతం చేసుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే 2000 సంవత్సరంలో కోలీవుడ్ స్టార్ హీరో అయిన అజిత్ కుమార్(Ajith Kumar)ను వివాహం చేసుకోగా.. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.. వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈమె మళ్లీ ఇండస్ట్రీలో కనిపించలేదు. అటు మీడియాలో కూడా చాలా తక్కువగా కనిపించింది. సోషల్ మీడియా ద్వారా అయినా అభిమానులకు చేరువవుతుంది అనుకున్నారు. అదీ జరగలేదు. ఇక భర్త ఆలనా పాలనా చూసుకుంటూ పిల్లలతో సమయాన్ని గడుపుతూ.. ఇంటికే పరిమితమైంది షాలినీ. అయితే ఇన్నేళ్ల తర్వాత సడన్గా మీడియా ముందు కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇన్నేళ్లయినా తరగని అందం.. ఎలా సాధ్యం..?
అసలు విషయంలోకి వెళ్తే..తాజాగా తన భర్త కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కి ‘పద్మభూషణ్’ అవార్డు లభించింది. ఇక ఈ అవార్డును అందుకుంటున్న సమయంలో ఆమె ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో ఆమెను చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు ఎంత అందంగా అయితే ఉందో ఇప్పుడు కూడా అదే అందం మెయిన్టైన్ చేస్తూ.. అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినా సరే షాలిని ఇంకా అంతే అందంగా ఉండడం చూసి ఈమె అందం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అంటూ అభిమానులు సైతం చర్చించుకోవడం మొదలుపెట్టారు.. ఏది ఏమైనా ఈ వయసులో కూడా షాలిని హీరోయిన్గా అడుగుపెట్టినా జనాలు యాక్సెప్ట్ చేస్తారని, కచ్చితంగా ఆమె ఇండస్ట్రీలోకి రావాలని కూడా కోరుకుంటూ ఉండడం గమనార్హం. మరి ఇన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న షాలినీ, కనీసం అభిమానుల కోరిక మేరకైనా ఇండస్ట్రీలోకి వస్తుందేమో చూడాలి.
భార్యపై ప్రశంసల కురిపించిన అజిత్ కుమార్..
ఇదిలా ఉండగా పద్మ భూషణ్ పురస్కారం అందుకున్న తర్వాత ఒక ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు అజిత్. అందులో తన భార్య గురించి మాట్లాడుతూ..”నేను ఇప్పటికీ సామాన్యుడిలాగానే ఆలోచిస్తాను. ఇంతటి విజయం సాధించడం వెనుక నా భార్య షాలిని ఉంది. ఆమె నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ప్రతి పనిలో కూడా నాకు తోడుగా నిలిచింది. ఒక్కోసారి నేను సరైన నిర్ణయాలు తీసుకోకపోయినా.. ఆమె అండగా నిలిచి నాకు మార్గాన్ని చూపించింది. కాబట్టి నా జీవితంలో సాధించిన సక్సెస్ క్రెడిట్ అంతా కూడా ఆమెకే ఇస్తాను. ఎంతో ప్రజాదారణ పొందిన నటి ఆమె.. అయినా సరే నా కోసం అన్నింటినీ వదులుకుంది.ఆమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు..వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నాను” అంటూ తెలిపారు.