HBD Mohan Lal:మలయాళం సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగిన హీరోలలో ఈయన కూడా ఒకరు. గత ఐదు దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన.. మలయాళంలోనే కాకుండా వివిధ భాషా చిత్రాలలో కూడా నటిస్తూ అలరిస్తున్నారు. అంతేకాదు హీరోగా మాత్రమే కాకుండా పలువురు స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మోహన్ లాల్ పుట్టిన రోజు ఈ రోజు. ఈ సందర్భంగా.. వరుసగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో రూ.100 కోట్లు కలెక్షన్ వసూలు చేస్తున్న మోహన్ లాల్ ఇప్పటివరకు ఎంత దాచిపెట్టారు..? ఒక్కో సినిమాకు ఆయన తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
మోహన్ లాల్ కెరియర్..
1960 మే 21న కేరళలోని పథనంథిట్ట అనే గ్రామంలో జన్మించారు. ఈయన పూర్తి పేరు మోహన్ లాల్ విశ్వనాథన్. ఈయన తండ్రి పేరు విశ్వనాథన్ నాయర్. కేరళ ప్రభుత్వంలో లా సెక్రటరీ సహ కీలక హోదాలో పనిచేశారు. తిరువనంతపురంలోని మహాత్మ గాంధీ కాలేజీలో బీకాం పూర్తి చేసిన ఈయన రెజ్లర్ కూడా.. 1977, 1978లో కేరళ స్టేట్ రెజ్లింగ్ ఛాంపియన్గా కూడా నిలిచారు. ఇక ఈయన సినీ రంగం వైపు అడుగులు వేయడానికి కారణం దర్శకుడు ఉన్నికృష్ణన్ పిళ్లై. ఈయన సహాయంతోనే 1980లో ‘మంజిల్ విరింజా పొక్కల్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కిరీడం, చంద్రలేఖ, నరసింహం, దృశ్యం, పులి మురుగన్ వంటి ఎన్నో చిత్రాలు ఈయనకు మంచి పేరు సంపాదించాయి. అంతేకాదు ‘పులిమురుగన్’ సినిమాతో రూ.100కోట్ల క్లబ్లో చేరిన తొలి మలయాళ నటుడిగా నిలిచారు. ఆ తర్వాత ‘లూసిఫర్’ తో రూ.200 కోట్ల క్లబ్లో చేరిన ఈయన.. ఈ ఏడాది ‘ఎల్ 2 : ఎంపురాన్’ సినిమాతో రూ.300 కోట్ల క్లబ్ వైపు అడుగులు వేసి, కాస్త వెనకడుగు వేశారు. ఆ సంఖ్య రూ.268 కోట్ల వద్దే ఆగిపోయింది. అంతేకాదు ఒక్క కేరళలోనే తొలిసారిగా రూ. 100 కోట్ల మార్క్ దాటిన సినిమాగా ‘తుడరం’తో చరిత్ర సృష్టించారు మోహన్లాల్. ఇక సింగిల్ హీరో గానే కాకుండా మమ్ముట్టి, దిలీప్ కుమార్, విజయ్, విశాల్, ఎన్టీఆర్, పృథ్వీ రాజ్ కుమార్ వంటి స్టార్స్ సినిమాలలో కూడా నటించారు. 47 ఏళ్ల కెరియర్లో దాదాపు 400కు పైగా చిత్రాలలో నటించిన ఈయన ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. పద్మశ్రీ, పద్మ భూషణ్ తో పాటు భారత సైన్యం టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకు కూడా ఇచ్చింది. ఐదు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న ఈయన.. 17 సార్లు కేరళ రాష్ట్ర అవార్డులు, 11 ఫిలింఫేర్ అవార్డులు కూడా లభించాయి.
మోహన్ లాల్ రెమ్యూనరేషన్, లగ్జరీ కార్లు, ఆస్తులు..
మోహన్ లాల్ ఆస్తుల విలువ విషయానికి వస్తే.. సుమారుగా రూ.480 కోట్లకు పైగా ఆయన కూడబెట్టారని సమాచారం . ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ.25 నుండి రూ.30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని చిత్ర నిర్మాణంతో పాటు పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టారు. కొచ్చి లో ఒక హాస్పిటల్ తో పాటు రెస్టారెంట్ చైన్, సినిమా థియేటర్ ఉన్నాయి. ఇక కొచ్చిలో దాదాపు 9,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో లగ్జరీ విల్లా ఉంది. ఈయన దగ్గర ఉన్న లగ్జరీ కార్ల విషయానికి వస్తే.. రోల్స్ రాయిస్ పాంథమ్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ ఎల్ ఎస్ ఏఎంజి, పోర్సే కెయన్నే, బీస్ట్, బీఎండబ్ల్యూ x5 వంటి లగ్జరీ కార్లు ఆయన కార్ గ్యారేజ్ లో వున్నాయి.