Kalki 2898 AD: హీరోలు ప్యాన్ ఇండియా స్టార్లుగా మారడం కంటే అదే ట్యాగ్‌ను నిలబెట్టుకోవడమే చాలా కష్టం. ప్యాన్ ఇండియా స్టార్లు అవ్వడం వల్ల హీరోలకు మార్కెట్ పెరుగుతుంది.. వారి సినిమాలకు మినిమమ్ కలెక్షన్స్ కూడా వస్తాయి. అలాగే ఫ్లాప్ అయిన సినిమాలకు కూడా కలెక్షన్స్ రావడం పెద్ద విషయమేమీ కాదు. కానీ అలాగే సాగుతూ పోతే కొన్నాళ్లకు వారి మార్కెట్ మళ్లీ పడిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి నుండే ఇటీవల బయటపడ్డాడు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఈ ఏడాదిలో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. ఇప్పుడు మరోసారి ఈ సినిమా రచ్చ చేయడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది.
జపాన్‌లో విడుదల
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) నటించిన చిత్రమే ‘కల్కి 2898 ఏడీ’. చాలాకాలం తర్వాత ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేసింది. ఫార్మ్ కోల్పోయిన ఈ ప్యాన్ ఇండియా స్టార్‌ను మళ్లీ ఫార్మ్‌లోకి తీసుకొచ్చింది. కోవిడ్ టైమ్‌లోనే ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఒక సినిమా ఉంటుందనే వార్త బయటికొచ్చింది. కానీ ఈ మూవీ నుండి దాదాపు రెండేళ్ల పాటు ఎలాంటి అప్డేట్ లేదు. అలాంటిది నాగ్ అశ్విన్ అసలు ఎలాంటి సినిమా తీస్తున్నాడా అని అందరిలో సందేహం మొదలయ్యింది. కానీ ‘కల్కి 2898 ఏడీ’ విడుదలయ్యి పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ జపాన్‌లో విడుదలకు సిద్ధమయ్యింది.
Also Read: సెంచరీ కొట్టనున్న దుల్కర్ సల్మాన్.. ‘లక్కీ భాస్కర్’కే ఆ క్రెడిట్
ముందుగా ఇండియాలో
‘కల్కి 2898 ఏడీ’ అనేది ప్యాన్ ఇండియా కాదు.. ప్యాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతుందని మేకర్స్ మొదట్లోనే ప్రకటించారు. కానీ పలుమార్లు విడుదలను పోస్ట్‌పోన్ చేసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయడం కష్టంగా మారింది. అందుకే ముందుగా ఇండియన్ భాషల్లో విడుదల చేస్తే ఫారిన్ భాషల్లో ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ గురించి తర్వాత ఆలోచించవచ్చని అనుకున్నట్టున్నారు మేకర్స్. అందుకే జులైలో ఇండియాలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత వచ్చే ఏడాది జపాన్‌లో ప్రభాస్ ఫ్యాన్స్ ముందు సందడి చేయడానికి ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సిద్ధమయ్యింది. 2025 జనవరి 3న జపాన్ థియేటర్లలో సందడి చేయనుంది.
భారీ ఫ్యాన్‌బేస్
ప్రభాస్ అంటే కేవలం ప్యాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు.. ప్యాన్ వరల్డ్ స్టార్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు ఇండియాలోనే కాకుండా జపాన్ వంటి దేశాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘బాహుబలి’ తర్వాత ‘బాహుబలి 2’ సమయానికే జపాన్‌లో ప్రభాస్‌కు ఫ్యాన్ బేస్ మొదలయ్యింది. అప్పటినుండి తనకు అక్కడ ఫ్యాన్స్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు కూడా ‘కల్కి 2898 ఏడీ’ జపాన్ థియేటర్లలో విడుదలయితే నేరుగా దానిని చూడడం కోసం చాలామంది ఫ్యాన్స్ థియేటర్లకు వస్తారు. ఇప్పటికే గత నెలలో రష్యాలో ఈ సినిమా విడుదలయ్యి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. జపాన్‌లో విడుదలయిన తర్వాత చైనాలో కూడా ‘కల్కి 2898 ఏడీ’ విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.