Emergency : బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటించడంతో పాటు స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం మళ్లీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా జనవరి 17న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ చిత్రాన్ని పంజాబ్‌లో విడుదల చేయకూడదని చాలా మంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసనలపై కంగనా రియాక్ట్ అవుతూ, పంజాబీలను కూల్ చేసే ప్రయత్నం చేసింది.
‘ఎమర్జెన్సీ’కి మరో అడ్డంకి
‘ఎమర్జెన్సీ’ చిత్రంలో కంగనా రనౌత్ ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, దివంగత సతీష్ కౌశిక్, శ్రేయాస్ తల్పాడే వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా రిలీజైన ‘ఎమర్జెన్సీ’ సినిమాకు ప్రస్తుతం పంజాబ్‌లోని థియేటర్లలో ఎదురు దెబ్బ తగిలింది.
పంజాబ్‌లో కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ సినిమాను బ్యాన్ చేయాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో అడ్డంకులు దాటుకుని రిలీజైన ఈ సినిమాను బ్యాన్ చేయాలని విన్పిస్తున్న డిమాండ్ పై కంగనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఆమె తన పోస్ట్‌లో “ఇది కళ, కళాకారులను హింసించడమే. పంజాబ్‌లోని చాలా నగరాల నుండి ఈ వ్యక్తులు ‘ఎమర్జెన్సీ’ని ప్రదర్శించడానికి అనుమతించడం లేదని రిపోర్ట్స్ వస్తున్నాయి. నేను చండీగఢ్‌లో చదువుకోవడం, పెరగడం వల్ల సిక్కు మతాన్ని చాలా దగ్గరగా గమనించాను. నాకు అన్ని మతాల పట్ల గొప్ప గౌరవం ఉంది” అంటూ ఆవేదనను వ్యక్తం చేసింది. ఇప్పుడు కంగనా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ఎమర్జెన్సీ’కి రాజకీయ రంగు…
శాసనసభ సభ్యుడు సుఖ్‌పాల్ సింగ్ ఖైరా కంగనా పోస్ట్‌పై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అతను కంగనాకు సమాధానం ఇస్తూ ‘నేను శిరోమణి గురుద్వారా పరబంధక్ సమితి డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నాను. సిక్కులను చెడుగా చిత్రీకరించి, మన పంజాబ్ రాష్ట్రాన్ని, అక్కడి ప్రజలను కించపరిచేలా ఉన్న సినిమాను వెంటనే నిషేధించేలా చర్యలు తీసుకోవాలి’ అంటూ ఆ పోస్ట్‌లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను కూడా ట్యాగ్ చేశారు.
వివాదం ఏంటంటే?
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ చిత్రం ఎన్నో అవాంతరాలను అధిగమించి ఎట్టకేలకు ఈ సినిమా జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ పంజాబ్‌లో ఈ సినిమా ఫస్ట్ షో క్యాన్సిల్ అయింది. ఎందుకంటే ‘ఎమర్జెన్సీ’కి పంజాబ్‌లో చాలా వ్యతిరేకత ఎదురవుతోంది. సినిమాలోని పలు సన్నివేశాల్లో కంగనా సిక్కుల ప్రతిష్టను దిగజార్చిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని విడుదల చేయకుండా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి.
ఇటీవలే శిరోమణి గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి ఈ చిత్రానికి సంబంధించి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌కి లేఖ రాశారు. ‘పంజాబ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తే సిక్కు వర్గాల్లో ఆగ్రహం, అసంతృప్తి కలుగుతుందని, అందుకే రాష్ట్రంలో ఈ సినిమా విడుదలను నిషేధించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’ అని లేఖలో రాశారు. మరోవైపు ‘ఎమర్జెన్సీ’ సినిమాపై నిషేధం విధించాలన్న డిమాండ్ విన్పిస్తున్న నేపథ్యంలో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని పీవీఆర్ సినిమాస్ వెలుపల భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. అయినప్పటికీ నల్లజెండాలు చూపుతూ ‘ఎమర్జెన్సీ’కి వ్యతిరేకంగా పలు థియేటర్ల బయట పలువురు వ్యక్తులు నల్లజెండాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలా చోట్ల మూవీ స్క్రీనింగ్ ను ఆపేసినట్టు సమాచారం. కాగా ‘ఎమర్జెన్సీ’ సినిమాని బంగ్లాదేశ్‌లో కూడా బ్యాన్ చేశారు.
This is complete harassment of art and the artist, from Punjab many cities are reporting that these people are not allowing Emergency to be screened.
I have utmost respect for all religions and after studying and growing up in Chandigarh I have closely observed and followed Sikh… https://t.co/VQEWMqiFih— Kangana Ranaut (@KanganaTeam) January 17, 2025