Disha Patani : పాన్ ఇండియా హీరోయిన్ దిశా పటాని (Disha Patani) తండ్రి దారుణంగా మోసపోయాడనే వార్త, ఆమె అభిమానులు అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ, నటి దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీ (Jagadish Singh Patani)కి రూ. 25 లక్షల టోకరా వేశారట నిందితులు. దీంతో 5 మంది మీద ఆయన కేసు వేశారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం పదండి.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగం ఇప్పిస్తానని దిశా పటాని (Disha Patani) తండ్రి జగదీష్ సింగ్ పటానికి ఆశ చూపారట ఆ కేటుగాళ్లు. బరేలీ నివాసి, మాజీ పోలీసు అధికారి అయిన జగదీష్ పటాని అలా మోసగాళ్ల ఉచ్చులో పడి, కీలక ప్రభుత్వ పదవి వస్తుందనే ఆశతో భారీ మొత్తంలో చెల్లించాడు. కానీ తరువాత తన తప్పును గ్రహించారాయన. అయితే ఆయన కళ్ళు తెరిచేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సదరు మోసగాడు యుపి ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయి, ప్రభుత్వంలో ఉన్నత పదవిని ఇప్పిస్తాను అని పేర్కొంటూ దిశా పటాని తండ్రికి కాల్ చేసినట్టు సమాచారం. ఫోన్ లో అతను అడిగినంత డబ్బు చెల్లిస్తే, జగదీష్ సింగ్ ను యూపి రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక కార్పొరేట్ సంస్థకు చైర్మన్‌గా నియమిస్తానని హామీ ఇచ్చాడట.
దిశా పటానీ (Disha Patani) తండ్రి ఆ మోసాన్ని గ్రహించకపోవడంతో డబ్బులు ఇవ్వడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి రూ.20 లక్షలు నకిలీ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడంతో పాటు, రూ.5 లక్షల డబ్బును కూడా వాళ్ళకు ఇచ్చాడట దిశా పటాని తండ్రి. డబ్బులు ఇచ్చి రోజులు గడుస్తున్నా పని జరగకపోవడంతో మోసపోయానని భావించాడు జగదీష్ సింగ్. ఆ తర్వాత వాళ్ళను తన డబ్బులు తనకు తిరిగి ఇచ్చేయమని అడగడంతో అసలు సమస్య మొదలైంది. డబ్బులు ఇవ్వకపోగా తిరిగి దిశా తండ్రి జగదీష్ ను బెదిరించారట సదరు కేటుగాళ్లు. దీంతో ఆయన చేసేదేం లేక బరేలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు ఈ కేసుపై అక్కడి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. అయితే ఈ ఘటనపై దిశా, ఆమె కుటుంబ సభ్యులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ 5 మందిపై కేసు నమోదయిందని, అందులో ఒక వ్యక్తి దిశా తండ్రి జగదీష్ కు తెలిసిన వ్యక్తే అని టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉండగా దిశా పటాని (Disha Patani) హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘కంగువ’ (Kanguva). ఈ పాన్ ఇండియా మూవీ నవంబర్ 15న థియేటర్లలో విడుదలైంది. సూర్య, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి నెగెటివ్ టాక్ నడుస్తోంది. సినిమాను చూసిన ఆడియన్స్ స్క్రిప్ట్, లౌడ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్‌లను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కలెక్షన్స్ కూడా దారుణంగా ఉన్నాయి. ఇక ఈ మూవీ కంటే ముందు దిశా పటాని ‘కల్కి’లో కూడా కన్పించింది.