Indian Railways Rules: దేశ వ్యాప్తంగా నిత్యం కోట్లాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో లేదంటే మిత్రులతో కలిసి ప్రయాణం చేస్తారు. అప్పుడు, ఒకే PNR నంబర్ మీద ఒకటికి మించి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒక్కోసారి వాటిలో కొన్ని టికెట్లు వెయిటింగ్ లిస్టులో ఉంటాయి. ఇంతకీ టికెట్లు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నవారు రైలులో ప్రయాణించే అవకాశం ఉందా? లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ పరిస్థితుల్లో రైల్వే నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం..
ఇంతకీ PNR, వెయిటింగ్ టికెట్ అంటే?
PNR అంటే ప్యాసింజర్ నేమ్ రికార్డ్. రైలు ప్రయాణ సమాచారానికి సంబంధించి రైలు రిజర్వేషన్ సిస్టమ్ లో సేవ్ చేయబడే కోడ్. రైలు టికెట్లు బుక్ చేసినప్పుడు PNR నంబర్ జెనరేట్ అవుతుంది. ఒక PNR నంబర్ మీద ఒకటి కంటే ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే, అన్ని టికెట్లు కన్ఫామ్ అవుతాయనే గ్యారెంటీ లేదు. కొంత మంది టికెట్లు కన్ఫామ్ అవుతాయి. మరికొంత మంది టికెట్లు వెయిటింగ్ లిస్టులో ఉంటాయి. అయితే, కొంత మంది టికెట్లు కన్ఫామ్ అయి, మరికొంత మంది టికెట్లు వెయిటింగ్ లిస్టులో ఉంటే ఏమవుతుంది?
రైల్వే నిబంధనలు ఏం చెప్తున్నాయి?
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, ఒకే PNR నంబర్ మీద ఆరుగురు ప్రయాణీకులకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆ ఆరుగురు ప్రయాణీకులలో కొందరికి టిక్కెట్లు కన్ఫామ్ అయితే, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న మిగిలిన వారు కూడా ప్రయాణించే అవకాశం ఉంది. అయితే, వారికి సీటు దొరురుకుతుందనే గ్యారెంటీ లేదు. టికెట్ కన్ఫామ్ అయిన వాళ్లు ఎవరైనా ప్రయాణించకపోతే, టీసీని అడిగి వారి ప్లేస్ లో కూర్చోవచ్చు. కచ్చితంగా ప్రయాణం చేయాల్సి ఉంటే వెళ్లొచ్చు. అయితే, ప్రయాణ సమయంలో నిలబడి వెళ్లడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
Read Also: టికెట్ తీసుకోకున్నా ట్రైన్ జర్నీ చెయ్యొచ్చు! రైల్వే కొత్త రూల్ గురించి మీకు తెలుసా?
ఒక్కటి టికెట్ కూడా కన్ఫామ్ కాకపోతే?
ఒక PNR నంబర్ మీద కనీసం ఒక్క టికెట్ కూడా కన్ఫామ్ కాకపోతే, ఆ నెంబర్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ప్రయాణీకులు తమ మొత్తాన్ని రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. అంటే, కనీసం ఒక PNR నంబర్ మీద ఒక టికెట్ కన్ఫామ్ అయినా మిగతా వాళ్లకు జర్నీ చేసే అవకాశం ఉంటుంది. అయితే, టికెట్ సీటు కన్ఫామ్ కాకపోవడం వల్ల ప్రయాణ సమయంలో ఇబ్బందులు పడే అకాశం ఉంటుంది. అలాంటి ప్రయాణం చేయకపోవడమే ఉత్తమం. వీలైనంత వరకు ముందుగా బుక్ చేసుకోవడం వల్ల కన్ఫామ్ టికెట్లు పొందే అవకాశం ఉంటుంది.
Read Also: మీరు వెళ్లాల్సిన రైలు మిస్సయ్యిందా? అదే టికెట్ తో మరో రైల్లో వెళ్లొచ్చు! ఎలాగో తెలుసా?