Kasthuri Raja:ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తాజాగా నవంబర్ 18 వ తేదీన నయనతార(Nayanthara)పుట్టినరోజు సందర్భంగా.. ఆమెకు సంబంధించి డాక్యుమెంటరీని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ డాక్యుమెంటరీ విడుదలకు ముందు ట్రైలర్ ను విడుదల చేయగా.. అందులో మూడు సెకండ్ల నిడివి ఉన్న ఒక క్లిప్ ని జత చేశారు. దీంతో తన పర్మిషన్ లేకుండా తన సినిమాలోని క్లిప్ పెట్టారని నయనతార కు రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపించారు ధనుష్ (Dhanush). దీనిపై స్పందించిన నయనతార మీ కుటుంబ సభ్యుల సపోర్టుతో మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు అంటూ బహిరంగ లేఖ ఒకటి వదిలింది. అయితే దీనిపై తాజాగా హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా (Kasthuri Raja) స్పందించారు.
వెన్నుపోటు పొడిచే వాళ్లకు సమాధానం చెప్పే టైం లేదు..
నయనతార , ధనుష్ మధ్య గొడవ సోషల్ మీడియాలో తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో.. తాజాగా ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఇలా స్పందించారు. “మాకు పని ముఖ్యం.. అందుకే మేము ముందుకు సాగుతున్నాం. వెన్నుపోటు పొడిచే వారికి సమాధానం చెప్పే సమయం మాకు అంతకంటే లేదు. అలాగే నాలాగే నా కొడుకు దృష్టి కూడా పని పైనే ఉంటుంది” అంటూ తెలిపారు కస్తూరి రాజా. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది విన్న నెటిజన్స్.. వెన్నుపోటు అనే అంత పెద్ద మాట మాట్లాడారు అంటే నయనతార – ధనుష్ మధ్య ఇంకా ఏదో ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
రూ.10 కోట్ల నష్టపరిహారం..
ఇకపోతే 2015లో ధనుష్ నిర్మించిన ‘నానుం రౌడీ దాన్’ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. అయితే తాజాగా నెట్ ఫ్లిక్స్ నయనతార డాక్యుమెంటరీ తయారు చేసేటప్పుడు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు తీసుకోవాలనుకుంది. అందులో భాగంగానే ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) కోసం రెండేళ్ల పాటు నయనతార ధనుష్ చుట్టూ తిరిగిందట..కానీ ఆయన తన సినిమాలోని క్లిప్స్ ఇవ్వడానికి నిరాకరించారు. అయినా సరే నయనతార ఆ సినిమాలో కేవలం ఒక్క సన్నివేశాన్ని మాత్రమే అందులో పెట్టుకుంది. అది కూడా కేవలం మూడు సెకండ్లు మాత్రమే. ఆ ట్రైలర్ కాస్త విడుదలవడంతో ట్రైలర్ లో ఈ సినిమా క్లిప్స్ కనిపించిన వెంటనే ధనుష్ .. నా పర్మిషన్ లేకుండా నా సినిమాలో క్లిప్స్ ఎలా వాడుకుంటారు..? దీనికి నష్టపరిహారంగా రూ .10కోట్లు చెల్లించాలి అంటూ లీగల్ నోటీసులు పంపించారు.
రెక్కల కష్టం పైకొచ్చాను..
దీనిపై స్పందించిన నయనతార.. ఓపెన్ గా లేఖ వదిలింది.” మీరు, మీ తండ్రి కస్తూరి రాజా, సోదరుడు సెల్వ రాఘవన్ సహాయ సహకారాలతో ఇండస్ట్రీలో ఈ స్థానంలో ఉన్నారు. కానీ నేను మాత్రం సొంత కష్టంతోనే ఈ స్థాయికి వచ్చాను. డాక్యుమెంటరీ కోసం అందరూ నాకు సహాయపడ్డారు. కానీ మీరు మనసులో ఏదో కక్ష పెట్టుకొని ఇలా రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసులు పంపించడం సమంజసం గా లేదు” అంటూ మూడు పేజీలు కలిగిన పోస్ట్ ఒకటి షేర్ చేసింది నయనతార .ఈ నేపథ్యంలోనే నయనతార ఓపెన్ లెటర్ పై స్పందించిన కస్తూరి రాజా ఈ విధంగా కామెంట్లు చేశారు.