Delhi Work From Home| దేశరాజధాని ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం ప్రాణాంతక స్థాయికి చేరింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే 50 శాతం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రకటించింది. ఢిల్లీ వాయు కాలుష్యం ఏక్యూ 526కు చేరిందని.. బుధవారం ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గోపాల్ రాయ్ అధికారికంగా ప్రకటన జారీ చేశారు.
“వాయు కాలుష్యం తగ్గించడానికి అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పాటించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 50 శాతం ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలి. ఈ విధానం అమలు చేయడానికి ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సెక్రటేరియట్ సమావేశంలో చర్చ జరుగుతుంది” అని హిందీలో మంత్రి గోపాల్ రాయ్ హిందో ట్వీట్ చేశారు.
అంతకుముందు వాయు కాలుష్యం తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కీలక విభాగాల కార్యాలయాలకు, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ పనివేళల గురించి.. ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. సోమవారం.. సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (సిఎస్ఎస్) అధికారులందరూ.. వాయు కాలుష్యం తీవ్రత కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనికి తోడు పనిగంటలు కుదించాలని.. ఆఫీసుల్లో ఉద్యోగులందరి ఆరోగ్యం కోసం అన్ని భవనాల్లో ఎయిర్ ప్యూరిఫయర్స్ ఏర్పాటు చేయాలని అడిగారు.
Also Read: వారికి ఎన్నికలు కాదు విలాసాలే ముఖ్యం.. ఓటు వేయని సంపన్నులపై మండిపడిన పారిశ్రామికవేత్త..
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ విభాగమైన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనెల్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీకి సిఎస్ఎస్ అధికారులు ఓ లేఖ రాశారు. అందులో ఉద్యోగులకు వాయు కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. శ్వాస సంబంధిత సమస్యలు, కంట్లో ఇరిటేషన్, అలసట లాంటి లక్షణాలు ఉన్నాయని పేర్కొంటూ ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతులు ఇవ్వాలని, పరిస్థితులను అదుపులో పెట్టడానికి అత్యవసరంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం పనివేళలు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 వరకు, ఢిల్లీ ప్రభుత్వ ఆఫీసుల పనివేళలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు మార్చారు.
ఢిల్లీ అన్ని ప్రాంతాల్లో వాయు సగటున ఏక్యూ 526 నమోదైంది. అశోక్ విహార్ లో గరిష్టంగా ఏక్యూ 634, గ్రేటర్ కైలాష్ లో కనిష్టంగా ఏక్యూ 256 నమోదైంది. వాయు కాలుష్యం తీవ్రం కావడంతో ఢిల్లీలోని ఆస్పత్రుల్లో శ్వాస సంబంధిత రోగాలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ సమస్య కనిపిస్తోంది.
ఢిల్లీలో GRAP IV నిబంధనల అమలు
రోజురోజుకీ వాయు కాలుష్యం పెరిగిపోవడంతో ఢిల్లీలో మంగళవారం నుంచి GRAP IV నిబంధనల అమల్లోకి వచ్చాయి. ఇందులో భగంగా రాజధానిలో BS-IV, పాత డీజిల్ వాహనాలు రోడ్లపై తిరగడానికి అనుమతి లేదు. అత్యవసర సేవల కోసం ఉపయోగించే వాహనాలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. దీనికి తోడు ఢిల్లీలో దుమ్ము ధూళిని వ్యాప్తి చేస్తున్నందుకు నిర్మాణాలు కూడా నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.