Kasturi Shankar:ప్రముఖ నటీమణి కస్తూరి శంకర్ (Kasthuri Shankar) ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న తెలుగువారిని తక్కువ చేసి మాట్లాడుతూ.. ఏకంగా జైలుకెళ్ళి వచ్చిన ఈమె, ఇప్పుడు మరొకసారి అల్లు అర్జున్ కేసు పై స్పందించి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉండగా మంగళగిరిలో మీడియా నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అటు అల్లు అర్జున్ (Allu Arjun)గురించి, ఇటు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడిన మాటలను దృష్టిలో పెట్టుకొని ఒక పోస్ట్ షేర్ చేసింది కస్తూరి శంకర్. ఇక దీంతో ఈమె పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
పవన్ కల్యాణ్ పై నటి కస్తూరి సంచలన ట్వీట్
తాజాగా కస్తూరి శంకర్ తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా..”పెద్దరికం అంటే పవన్ కళ్యాణ్‌దే. చాలా మెచ్యూరిటీ గా, ఎంతో హుందాగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా తన, మన, అధికారం అనే ఎలాంటి పక్షవాతం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పారు. మనమందరం ఈ అల్లకల్లోలమైన విషాదాన్ని వదిలేసి వినయంగా 2025లోకి అడుగు పెడదాం” అని అందులో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్స్ ను సైతం ఆమె షేర్ చేసింది.
అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన పవన్ కళ్యాణ్..
మంగళగిరిలో ఏర్పాటుచేసిన మీడియా చిట్ చాట్ లో భాగంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ..”గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు. రేవతి గారు మృతి చెందిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శిస్తే సరిపోయేది. అక్కడే మానవతా దృక్పథం లోపించినట్లు అనిపించింది. కనీసం అల్లు అర్జున్ కాకపోయినా చిత్ర బృందంలో ఎవరో ఒకరు వెళ్లినా బాగుండేది. ఇక్కడ అల్లు అర్జున్ ను మాత్రమే తప్పు పట్టడం సరికాదు. ఎవరైనా సరే ఏ హీరో అయినా తన సినిమా విడుదలైన మొదటి రోజు థియేటర్లలో అభిమానులతో కలిసి సినిమా చూడాలనుకుంటారు. నేనైనా అలాగే చేస్తాను” అంటూ అల్లు అర్జున్ కి సపోర్టుగా మాట్లాడారు. ఆ వెంటనే చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే. అక్కడ తప్పు జరిగింది కాబట్టి పోలీసులు అరెస్టు చేశారు. ఒకవేళ అక్కడ నేను ఉన్నా సరే, నేను తప్పు చేసినా అరెస్టు చేయండి అని అసెంబ్లీలోనే చెప్పాను. చట్టం ముందు అందరూ సమానమే. అందుకే పోలీసులు తారతమ్యం లేకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఏది ఏమైనా రేవతి మరణం తర్వాత వెంటనే అల్లు అర్జున్ లేదా చిత్ర బృందం ఎవరో ఒకరు స్పందించి ఉంటే అక్కడితో సమస్య ఆగిపోయేది. కానీ ఇప్పుడు ఇంతవరకు తెచ్చుకున్నారు అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. ఈ కామెంట్లను ఆమె షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని అందరికీ మరొకసారి తెలియజేసింది. ఇక ప్రస్తుతం కస్తూరి శంకర్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.