Keerthy Suresh : టాలీవుడ్ లో మహానటిగా మంచి పాపులారిటీని సంపాదించుకున్న కోలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh). అయితే ఆ తర్వాత కీర్తి సురేష్ కి తన కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ మాత్రం పడలేదు. ఇటు తెలుగు అటు తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలలో నటించినప్పటికీ కాలం కలిసి రాలేదు. దీంతో ప్రస్తుతం మరోసారి టాలీవుడ్ వైపే చూస్తోంది కీర్తి సురేష్. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఓ తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ రెండు క్రేజీ ప్రాజెక్టులు ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. మరి ఆ ప్రొడ్యూసర్ ఎవరు ? కీర్తి సురేష్ నటించిన ఆ రెండు టాలీవుడ్ సినిమాలు ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే…
కీర్తికి రెండు క్రేజీ ఆఫర్లు
కీర్తి సురేష్ తెలుగు సినిమాలు చేయక చాలా కాలమే అవుతుంది. 2023లో ఆమె చివరిసారిగా ‘భోలా శంకర్’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత తమిళ, హిందీ సినిమాలతో బిజీ అయిపోయింది. అలాగే గత ఏడాది ఈ బ్యూటీ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లయ్యాక కీర్తి సురేష్ కొత్త సినిమాలకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఆమె టాలీవుడ్ వైపు దృష్టి సారించిందని సమాచారం.
ఇటీవల వేణు యెల్దండి ‘ఎల్లమ్మ’ (Yellamma) కథను కీర్తి సురేష్ కి వివరించారని, ఆమె నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తోంది. అలాగే మరోవైపు విజయ్ దేవరకొండ కొత్త సినిమా కోసం ఆమెతో మేకర్స్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ రెండు సినిమాలు గనక ఓకే అయితే కీర్తి సురేష్ మరోసారి టాలీవుడ్ లో బిజీ కావడం ఖాయం.
దిల్ రాజు ప్రొడక్షన్స్ లోనే రెండు సినిమాలు
ఇక ఇప్పుడు కీర్తి సురేష్ నటించబోతోంది అని రూమర్లు వినిపిస్తున్న రెండు సినిమాలు కూడా దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలోనే తెరకెక్కుతుండడం గమనార్హం. నితిన్ హీరోగా వేణు యెల్దండి దర్శకత్వంలో రాబోతున్న ‘ఎల్లమ్మ’ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న మరో ప్రాజెక్టును కూడా స్వయంగా దిల్ రాజు ప్రొడక్షన్స్ పై దిల్ రాజే నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘రౌడీ జనార్ధన్’ (Rowdy Janardhan) అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది.
అయితే ఇప్పటిదాకా ఈ రెండు సినిమాలలో కీర్తి సురేష్ నటించబోతోంది అని రూమర్లు రావడమే తప్ప అధికారికంగా అనౌన్స్మెంట్ రాలేదు. ఆ ప్రకటన కోసమే కీర్తి సురేష్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వార్తలు కనక నిజమైతే ఈ రెండు సినిమాల ద్వారా టాలీవుడ్లో కీర్తి స్ట్రాంగ్ రీఎంట్రీ ఇవ్వబోతోంది అని చెప్పొచ్చు. మరి ఇప్పటికైనా కీర్తి సురేష్ టాలీవుడ్ క్వీన్ గా స్థిరపడుతుందా? లేదంటే మళ్లీ తమిళ, హిందీ సినిమాలపై మక్కువతో ఇక్క మంచి ఫామ్ లోకి రాగానే అటు వెళ్లిపోతుందా ? అనేది చూడాలి.