Kootickal Jayachandran : గత ఏడాది మలయాళ చిత్ర సీమను హేమ కమిటీ నివేదిక కుదిపేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ నటుడు నాలుగేళ్ల అమ్మాయిపై అఘాయిత్యం చేసి, పరారీలో ఉన్నాడు. ఆ నటుడిని పట్టుకోవడం కోసం పోలీసులు ఏకంగా లుకౌట్ నోటీసులను జారీ చేశారు.
పోక్సో కేసులో నిందితుడు, నటుడు కూడికల్ జయచంద్రన్ (Kootickal Jayachandran) పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటిదాకా ఈ కేసులో జాప్యం చేస్తూ వచ్చారు పోలీసులు. కానీ నాలుగేళ్ల బాలికను వేధించిన కేసులో సదరు నటుడు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో ముందడుగు వేశారు. ఈ మేరకు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.
ముందస్తు బెయిల్ రద్దు
నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశారన్న ఫిర్యాదు మేరకు జూన్ 8న కసబా పోలీసులు నటుడు కూడికల్ జయచంద్రన్ (Kootickal Jayachandran) పై పోక్సో కేసు నమోదు చేశారు. చిన్నారి బంధువు ఈ ఫిర్యాదును చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ద్వారా పోలీసులకు పంపించారు. కుటుంబ కలహాలతో జయచంద్రన్ తన కుమార్తెను చిత్రహింసలకు గురి చేశాడని ఆ పాప తల్లిదండ్రులు నటుడిపై కంప్లయింట్ చేశారు. కసబా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి, బాలిక స్టేట్మెంట్ ను తీసుకున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించి అరెస్టు లేదా తదుపరి చర్యలు తీసుకోలేదు.
మరోవైపు కూడికల్ జయచంద్రన్ కోజికోడ్ పోక్సో కోర్టులో ముందస్తు బెయిల్ కు ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడు. జూలై 12న కూడికల్ జయచంద్రన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో చిన్నారి ధైర్యంగా ఇచ్చిన స్టేట్మెంట్ కొట్టిపారేసి, ఆమె నమ్మకాన్ని చిదిమేయకూడదు అని ప్రాసిక్యూషన్ కోరడంతో హైకోర్టు బెయిల్ నిరాకరించింది. అయినప్పటికీ పోలీసులు అతడిని అరెస్టు చేయలేదని సమాచారం.
లుకౌట్ నోటీసులు జారీ
ఓ వైపు విచారణ జరుగుతుండగా, మరోవైపు నిందితుడు సిటీలోని తన స్నేహితుల దగ్గర, వేర్వేరు ఫ్లాట్లలో తలదాచుకున్నట్లు సమాచారం. అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినా నిందితుడిని పోలీసులు పట్టుకోలేకపోయారు. ఈ కేసులో కౌటికల్ జయచంద్రన్ (Kootickal Jayachandran) పై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని పేర్కొంటూ బాలుడి బంధువు ఇటీవల రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు, కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. నిందితుడు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని, బాలికను, బంధువులను నటుడికి సంబంధించిన వ్యక్తులు బెదిరిస్తున్నారని ఆ కంప్లయింట్ లో పేర్కొన్నారు. దానికి భయపడి చిన్నారిని పాఠశాలకు పంపడం లేదని ఆ ఫిర్యాదులో వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా సెర్చ్ / లుకౌట్ నోటీసును జారీ చేశారు పోలీసులు. కాబట్టి అతను విదేశాలకు పారిపోయే అవకాశం లేదని అంటున్నారు. ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలో రెండు స్క్వాడ్‌లు కేసును దర్యాప్తు చేస్తున్నాయి. త్వరలోనే అతన్ని పోలీసులు పట్టుకునే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అతనిపై జారీ చేసిన లుకౌట్ నోటీస్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.