TDP – Janasena: ఏపీలో ఆ రెండు పార్టీల పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది. నిన్నటి వరకు అంత రచ్చ జరుగుతున్నా, సైలెంట్ గా ఉన్న ఆ పార్టీ అధినాయకత్వాలు ఇప్పుడు మాత్రం ష్.. గప్ చుప్ రాగాలు పలుకుతున్నాయి. మరి ఆ పార్టీల నాయకులు ఇప్పటికైనా సైలెంట్ గా ఉంటారా? ఇంకా అదే తరహా కామెంట్స్ సాగిస్తారా అన్నది మున్ముందు తెలియాల్సి ఉంది. అసలు ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవండి.
ఏపీలో ఇటీవల మంత్రి నారా లోకేష్ పేరు మార్మోగింది. లోకేష్ కు డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వాల్సిందేనని పలువురు టీడీపీ అగ్ర నేతల నుండి నాయకుల వరకు తమ వాణి వినిపించారు. ముందు మహాసేన రాజేష్, ఆ తర్వాత కడప టీడీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ భరత్, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, ఇలా ఒకరి తర్వాత ఒకరు లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని గళమెత్తారు. అంతేకాదు సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ జనసేన కామెంట్స్ మార్మోగింది.
లోకేష్ కు డిప్యూటీ సీఎం, పవన్ కు సీఎం పోస్టు ఖరారైందని పలువురు జనసేన నాయకులు పోస్టులు కూడ పెట్టారు. ఈ దశలోనే తిరుపతికి చెందిన జనసేన లీడర్ కిరణ్ రాయల్ నేరుగా సీఎం పదవి పవన్ కు ఇవ్వాలని కరాఖండిగా చెప్పారు. పలు డిబేట్ లలో కూడ ఇదే వాణి వినిపించారు కిరణ్. ఇలా టీడీపీలో కొందరు, జనసేనలో కొందరు అదేపనిగా విమర్శల జోరు సాగించారు. ఇలాంటి పరిస్థితిని ఇప్పుడే సద్దుమణిగించకుంటే, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని భావించారో ఏమో కానీ, టీడీపీ అధినాయకత్వం దీనిపై స్పందించింది. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే ఊహాగానాలు అబద్దమని, ఎవరైనా ఈ విషయంపై మాట్లాడితే చర్యలు తప్పవంటూ క్యాడర్ కు హెచ్చరించింది.
Also Read: Vizag News: వైజాగ్‌లో క్రికెట్ బెట్టింగ్.. ‘బిగ్ బాస్’ కోసం పోలీసుల వేట..
టీడీపీ ఇలా ప్రకటన ఇచ్చిన మరుసటి రోజు జనసేన కూడ ఇదే తరహా హెచ్చరికలు జారీ చేసింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించవద్దని, ఈ అంశంపై మీడియా ముందు గానీ, సోషల్ మీడియాలో గానీ స్పందించవద్దంటూ జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటన ఇచ్చింది. మొత్తం మీద అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉందని పొలిటికల్ టాక్. మొదట ఈ టాక్ వినిపించినప్పుడే సద్దుమనిగించి ఉంటే నేడు ఇలాంటి పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.