Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). మరో 10 రోజుల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ మూవీ రిలీజ్ గురించి గత మూడేళ్లుగా కళ్ళు కాయలు కాసేలా మెగా అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఇప్పటిదాకా ఈ మూవీ ఆలస్యం అవుతూ రావడానికి కారణం ఇదేనంటూ ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ తాజాగా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన సీనియర్ హీరో శ్రీకాంత్ (Srikanth) ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఆలస్యానికి గల కారణం ఏంటో వెల్లడించారు.
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ రిలీజ్ ఆలస్యం కావడానికి ఎక్కువగా రీషూట్లు చేశారని టాక్ నడిచింది. అది నిజమేనా? అనే ప్రశ్నకి… ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ “నా పార్ట్ వరకు అయితే ఏం చెప్పారో అలాగే జరిగింది. ఒక్కరోజు కూడా అటు ఇటుగా జరగలేదు. కానీ ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే… నెంబర్ ఆఫ్ డేస్ అన్నది కాదు. ఒక సెటప్ గనక మిస్ అయింది అంటే, మళ్ళీ డేట్లు రావడానికి రెండు నెలలు మూడు నెలలు టైం పట్టేది. ఇప్పుడు ఉదాహరణకి నా డేట్సే ప్రాబ్లం అయితే గనక… ‘దేవర’ చేస్తున్నప్పుడు వీళ్లు డేట్స్ అడిగారు. ఆ టైంలో నాకు కుదరలేదు. నాకు కుదిరినప్పుడు సముద్రఖనికి కుదరలేదు. ఇలా చాలా రోజులు షూటింగ్ చేయలేదు. ఈ సినిమాకి కేవలం మేము 35 రోజులు షూట్ చేశాము. కానీ సినిమాకు కమిట్ అయ్యి 3 సంవత్సరాలయ్యింది. ఈ సినిమాలో నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉండడం వల్ల ఆర్టిస్టుల డేట్లు కుదరక లేట్ అయ్యింది. ఇక రీ-షూట్ ల విషయానికి వస్తే, సన్నివేశాలు చాలా పెద్దగా ఉన్నాయి. వాటిని కట్ చేసారే తప్ప, రీ షూట్ చేయలేదు. లెంగ్త్ ని క్రిస్ప్ చేశారు. సబ్జెక్ట్ మారడం గాని, లేదా రీ షూట్ చేయడం గానీ ఏమీ జరగలేదు. అయితే శంకర్ చిన్న చిన్న షాట్స్ కోసం ఒక రోజు పెట్టుకున్నారు” అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఇప్పుడు శ్రీకాంత్ చెప్పింది విన్న తర్వాత వార్నీ… దీని కోసమా మూవీని మూడేళ్లు లాక్కొచ్చారు? అంటూ కోపంతో కూడిన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ టైంలోనే డైరెక్టర్ శంకర్ ‘ఇండియన్ 2’ మూవీ షూటింగ్ చేయడం, అలాగే మరో డైరెక్టర్ తో ‘గేమ్ ఛేంజర్’లోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం వంటివి జరగడంతో ఈ మూవీని శంకర్ పూర్తిగా పక్కన పెట్టేసారు అన్న ప్రచారం జరిగింది. అలాగే సినిమా అనుకున్న విధంగా రాలేదని, మరోసారి రామ్ చరణ్ ను డేట్స్ అడగ్గా, ఆయన రిజెక్ట్ చేశారని అన్నారు. సినిమాలోని కొన్ని సీన్స్ చేశారని ప్రచారం జరిగింది. ఏదేమైనా మూడేళ్ల నిరీక్షణ తర్వాత ‘గేమ్ ఛేంజర్’ మూవీ జనవరి 10న థియేటర్లలోకి రాబోతోంది.