Kollywood:కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు.. ఎంత కష్టపడినా.. ఎంత సంపాదించిన తృప్తిగా తినడానికే కదా.. ఈ విషయం తెలుసుకుంటే ఎవరూ కూడా అత్యాశకు పోరు అని పెద్దలు చెప్పేవారు. అందుకే జీవనాన్ని సాగించడానికి కష్టపడి చేసే ఏ పనైనా సరే తృప్తిని ఇస్తుంది. ఈ క్రమంలోని నేడు స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఒక హీరో ఒకప్పుడు.. కోలీవుడ్లో మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఇప్పుడు కోలీవుడ్ లోనే స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకొని.. దాదాపు రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కి ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు శివ కార్తికేయన్ (Siva karthikeyan). ప్రస్తుత కాలంలో వైవిధ్యభరితమైన చిత్రాలలో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేక మార్కెట్ ఏర్పరచుకున్నారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన శివ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి.. స్వయంకృషితో రూ.300 కోట్ల బాక్సాఫీస్ స్టామినా ఉన్న హీరోగా ఎదిగారు.
మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు..
ఇకపోతే శివ కార్తికేయన్ పుట్టినరోజు ఈరోజు.. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణం వైరల్ గా మారుతోంది. 1985 ఫిబ్రవరి 17న ఒక తమిళ ఫ్యామిలీలో జన్మించిన ఈయన.. కాలేజ్ డేస్ లో కల్చరల్ ఈవెంట్స్ జరిగినప్పుడు స్టేజ్ మీద మిమిక్రీ చేస్తూ తన ఉనికిని చాటుకున్నారు. ఆ తర్వాత దానినే కెరియర్ గా ఎంచుకొని టెలివిజన్ ఇండస్ట్రీలోకి మిమిక్రీ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టాడు. తన వాక్చాతుర్యంతో అందరినీ మెప్పించిన ఈయన టెలివిజన్ ఇండస్ట్రీలో పలు టీవీ షోలకు యాంకరింగ్ చేశాడు. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా నటించాడు..ఇకపోతే ‘ఎగన్’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ కట్ లో ఆయన క్యారెక్టర్ ను తొలగించారు. దాంతో 2012లో ‘మెరీనా’ అనే సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు శివ కార్తికేయన్. అలాగే ధనుష్ (Dhanush ) నటించిన ‘3’సినిమాలో శివ కార్తికేయన్ నటించిన ఫ్రెండ్ క్యారెక్టర్ కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆ క్రేజ్.. హీరోగా అవకాశాలు అందించింది.
స్టార్ హీరోగా భారీ గుర్తింపు..
ఇక సపోర్టింగ్ క్యారెక్టర్స్ నుంచి హీరో క్యారెక్టర్స్ కు షిఫ్ట్ అయిపోయిన ఈయన అక్కడ నుంచి మళ్లీ వెను తిరిగి చూసుకోలేదు. ఇకపోతే ‘రెమో’ అనే డబ్బింగ్ మూవీ తో తెలుగు ఆడియన్స్ కి కూడా చేరువైన శివ కార్తికేయన్..కాలేజ్ డాన్, వరుణ్ డాక్టర్ లాంటి చిత్రాలతో తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్నారు. అలాగే ‘కౌశల్య కృష్ణమూర్తి’ సినిమాలో స్పెషల్ రోల్ చేసిన శివ కార్తికేయన్.. ‘ప్రిన్స్ ‘ సినిమాను నేరుగా తెలుగులో చేసి ఆకట్టుకున్నారుఇక గత ఏడాది ‘అమరన్’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్నారు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రూ.330 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించారు. త్వరలో ఈయనకు రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. శివ కార్తికేయన్ నటుడు మాత్రమే కాదు ప్రొడ్యూసర్ , సింగర్, లిరిసిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇలా మల్టీ టాలెంటెడ్ హీరో అనిపించుకున్నారు. ఇక ప్రస్తుతం ‘పరాశక్తి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తోంది. అలాగే ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో మదరాసి అనే సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.