Kota Srinivasarao: ఎన్నో విలక్షణమైన పాత్రలతో అందరిని మెప్పించి ఆకట్టుకున్న ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. ఈయన ఇటీవల పుట్టినరోజు వేడుకలు జరుపుకొని, ఈరోజు తుది శ్వాస విడవడం విశేషం. ఈయన మరణ వార్త తెలుసుకున్న సినీ పరిశ్రమలోని నటీ నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
పుట్టినరోజు వేడుకలు.. ఎప్పుడూ నిరాడంబరంగానే!
ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు తన పుట్టినరోజు వేడుకలను ఎప్పుడూ నిరాడంబరంగానే జరుపుకోవడం విశేషం. కృష్ణాజిల్లా కంకిపాడు లో 1942 జూలై 10వ తేదీన జన్మించిన కోట శ్రీనివాసరావు 750 కి పైగా సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సినీ రంగంలో సుస్థిరపరచుకున్నారు. ఇప్పటికే 9 నంది అవార్డులు అందుకున్న కోటా శ్రీనివాసరావు.. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినిమా రంగ ప్రవేశం చేశారు.
ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టే నైజం..
కోట శ్రీనివాసరావు ఏదైనా మాట్లాడితే ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టే నైజం కలిగిన వారిగా చెప్పవచ్చు. ఎన్నో సార్లు కోటా మాట్లాడిన మాటలు వివాదాలకు సైతం దారితీసాయి. మా ఎన్నికల సందర్భంగా కోట మాట్లాడిన మాటలు ఎంత వివాదాన్ని రేకెత్తించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆ సమయంలో కోట శ్రీనివాసరావుకు ఎందరో మద్దతుగా నిలిచి, ఆయన బాటలో నడిచిన నటులు సైతం ఉన్నారు. ఆడంబరాలకు దూరంగా జీవనం సాగిస్తూ, తాను సామాన్య నటుడినని చెప్పే కోట శ్రీనివాసరావు గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై సినిమాలకు సైతం దూరమయ్యారు.
చివరి పుట్టినరోజు వేడుకలు..
తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద వయస్సు గల నటులలో కోట శ్రీనివాసరావు ఒకరు. అందుకే ఈయన పుట్టినరోజున చిన్నపాటి నటుల నుండి దర్శకుల వరకు స్వయంగా ఆయన గృహానికి వెళ్లి సన్మానించడం సాంప్రదాయంగా వస్తోంది. 2015 లో కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ పురస్కారం అందగా ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున వేడుకలకు తాను దూరమని కోట చెప్పకనే చెప్పారట.
Also Read: Kota Srinivas Rao Death: కోటా శ్రీనివాసరావు చివరి ఫొటో ఇదే.. చూస్తే కన్నీళ్లు ఆగవు
మొదటి నుండి సంబరాలకు దూరంగా ఉంటూ.. వస్తున్న కోట శ్రీనివాసరావు జులై 10వ తేదీన చివరి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. సినిమా రంగానికి సంబంధించిన కరాటే కళ్యాణి, దర్శకుడు బండ్ల గణేష్ పలువురు నటులు వెళ్లి ఆయనకు బర్త్ డే శుభాకాంక్షలు తెలపడమే కాక కేక్ సైతం కట్ చేయించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు తన చివరి బర్త్డే వేడుకలు జరుపుకొని ఆదివారం తుది శ్వాస విడిచారు.
కోట ఇంటికి క్యూ కడుతున్న సినీ ప్రముఖులు
కోట శ్రీనివాసరావు కన్నుమూసిన వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ప్రస్తుతం ఆయన మృతదేహానికి ఘన నివాళులు అర్పించేందుకు క్యూ కట్టారు. కామెడీ, విలనిజం, పలు ప్రధాన పాత్రలతో తనకంటూ సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న కోటా మృతి చెందడంతో పలువురు రాజకీయ ప్రముఖులు సైతం సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయ రంగంలో సైతం ప్రవేశించి ఓసారి ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకున్న కోటా మృతి పట్ల ఏపీ తెలంగాణకు చెందిన సీఎంలు నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిలు ఘన నివాళులు అర్పించారు.