Ms Ilayaa: ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి దింటకుర్తి మురళీ కృష్ణ చేతుల మీదుగా ‘మిస్ ఇళయా’ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాకు మట్టా శ్రీనివాస్ నిర్మితగా వ్యవహరిస్తుండగా సహ నిర్మాణ బాధ్యతలను చాహితీ ప్రియా తీసుకున్నారు. జి వేముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కుషాల్ జాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘మిస్ ఇళయా’ పూజా కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. పూజా కార్యక్రమాలు పూర్తి కావడంతో ఆలస్యం లేకుండా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా త్వరలోనే ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పూజా కార్యక్రమం పూర్తయిన సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
ప్రత్యేకమైన సినిమా
కాస్మిక్ పవర్ ప్రొడక్షన్ బ్యానర్ ‘మిస్ ఇళయా’ మూవీని నిర్మిస్తోంది. ఈ పూజా కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు హీరో కుషాల్ జాన్ కూడా పాల్గొన్నాడు. వీరంతా సినిమాపై తమ నమ్మకాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఈ సినిమా కథ వినగానే చాలా ఆసక్తికరంగా అనిపించింది. నేను ఇలాంటి పాత్రలో నటించడం ఇదే మొదటిసారి. నా కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకునే సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ప్రేక్షకుల ఆదరణ కోసం ఎదురుచూస్తున్నాను’’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు కుషాల్ జాన్. దర్శకుడు వేముల జీ కూడా ఈ సినిమాపై నమ్మకం వ్యక్తం చేశారు.
నమ్మకంతో ఉన్నాం
‘‘వినూత్నమైన కథతో తెరకెక్కుతున్న సినిమానే మిస్ ఇళయా. ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. హీరో కుషాల్ జాన్ ఈ పాత్రకు న్యాయం చేస్తారని నమ్మకంగా చెప్పగలను. మేము ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో రూపొందించబోతున్నాం’’ అంటూ ‘మిస్ ఇళయా’ గురించి చిన్న గ్లింప్స్ ఇచ్చారు. ‘‘మా బ్యానర్ కాస్మిక్ పవర్ ప్రొడక్షన్‌పై ఒక సినిమాను నిర్మించాలని చాలా రీసెర్చ్ చేసి ఈ కథను ఎంపిక చేసుకున్నాం. సినిమాకు అనుగుణంగా ఉన్న టెక్నికల్ టీమ్, ప్రతిభావంతమైన నటీనటులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే సినిమా అవుతుందని నమ్మకం ఉంది’’ అంటూ మేకర్స్ అంతా ‘మిస్ ఇళయా’ను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నారు.
Also Read: స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకోలేకపోయిన నమత్ర సోదరి.. ఇన్ని కష్టాలు పడినా ఫలితం లేదా.?
త్వరలో ప్రకటిస్తాం
‘మిస్ ఇళయా’ (Ms Ilayaa) సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మూవీలో యాక్ట్ చేసే నటీనటులు, టెక్నికల్ టీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే కుషాల్ జాన్ (Kushal Jaan) హీరోగా ‘వధుకట్నం’ అనే మూవీ తెరకెక్కింది. 2022లో విడుదలయిన ఈ సినిమాతో కుషాల్ హీరోగా మొదటిసారి ప్రేక్షకులను పలకరించాడు. అందులో తన యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పటికే తన లుక్స్‌తో చాలామందిని ఆకట్టుకోగలిగాడు కుషాల్. ఇప్పుడు మరోసారి ‘మిస్ ఇళయా’ అనే చిత్రంతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.